మల్కన్‌గిరి: సమితి పరిధి పద్మాగిరి పంచాయతీ పెడకొండ గ్రామంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ–20 క్రికెట్ టోర్నమెంట్‌లో మల్కన్‌గిరి జట్టు విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్‌లు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను అభినందించారు. మల్కన్‌గిరి – సుకుమ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌లో మల్కన్‌గిరి జట్టు విజయం సాధించింది. విజేతలను పలువురు అభినందించారు.
సోషల్ మీడియాలో
విద్వేషపూరిత పోస్టులు
● నిందితుడు అరెస్టు
రాయగడ: సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరంగా, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత పోస్టులు పెడుతున్న వ్యక్తిని ఝార్సుగుడ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర శుక్రవారం వివరాలు వెల్లడించారు. బరఘడ్ జిల్లాలోని పైకమాల్ పోలీస్‌స్టేషన్ పరిధి గురుండా గ్రామానికి చెందిన ప్రసాద్ మహాదే సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్టు చేయడంతో పాటు దానిని ఇతరులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయ్యింది. కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు విచారణ చేపట్టి అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రాయగడలో
మెగా వైద్య శిబిరం
రాయగడ: స్థానిక పాత పోలీస్‌స్టేషన్ సమీపంలోని సరోజిని క్లీనిక్‌లో డాక్టర్ అందవరపు గౌరీశంకరరావు ఆధ్వర్యంలో శుక్రవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లాలోని బిసంకటక్, కల్యాణ సింగుపూర్, సికరపాయి, రాయగడ పరిసర ప్రాంతాలకు చెందిన 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి మందులను అందజేశారు. ప్రతినెలా ఇటువంటి తరహా ఉచిత వైద్య శిబిరాన్ని క్లినిక్‌లో నిర్వహిస్తున్నామని డాక్టర్ గౌరీశంకర్ తెలిపారు. అయితే ఈసారి ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా రాయగడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు ఈ శిబిరంలో పాల్గొని, వారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు.
సర్వీసు వైర్లు చోరీ
రణస్థలం: లావేరు నుంచి ఇజ్జాడపాలెం వైపు వెళ్లే రహదారి మధ్యలో వ్యవసాయ విద్యుత్ మోటార్ సర్వీస్ వైర్‌ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి చోరీ చేశారు. అదే ప్రాంతంలోని సుమారు 10మంది రైతుల మోటార్లకు ఉన్న సర్వీస్ వైర్లను కట్ చేసి పట్టుకుపోయారు. శనివారం గమనించిన బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొందరి వైర్లు మోటార్ బోరు లోపల పడిపోవడం వల్ల కొత్తగా వేయాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాగి కోసం, ఇతరులకు సర్వీస్ వైరు అమ్మేందుకు ఇలా చేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం భరిణికాంలో కూడా కొంతమంది రైతుల మోటార్ సర్వీస్ వైర్లు, రాగి చోరీ చేశారని తెలిపారు. అనంతరం లావేరు ఎస్సై కె.అప్పలసూరికి రైతులు ఫిర్యాదు చేశారు.


