దోపిడీ కేసులో ఐదుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దోపిడీ కేసులో ఐదుగురు అరెస్టు

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

జయపురం: కాజూ వ్యాపారులపై దాడిచేసి డబ్బు దోచుకుపోయిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో కుములిపుట్‌ గ్రామ పంచాయతీ దండసేనగుడ గ్రామానికి చెందిన డొంబురుదొర మఝి, పూజారిపుట్‌కు చెందిన రమేష్‌ హరిజన్‌, టుకు హరిజన్‌, ధైతారి హరిజన్‌, కుములిపుట్‌ పంచాయతీకి చెందిన ప్రఫుల్ల నాయిక్‌లు ఉన్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్‌ తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే...

జయపురం పట్టణంలోని దాసరి వీధికి చెందిన అమరనాథ్‌, భూపతి వీధికి చెందిన ఎస్‌.వైకుంఠంలు జయపురం సమితి కేవీడీ ప్రాంతంలోని కాజు మిల్లులో బిజినెస్‌ భాగస్వాములు. వారిరువురు మే 30వ తేదీన రాత్రి రెండు ద్విచక్ర వాహనాలపై మిల్లు నుంచి జయపురం వస్తుండగా కుమిలిపుట్‌ పంచాయతీ దండసేన్‌ గుడ గ్రామం వద్ద దుండగులు వారిని అడ్డగించారు. అనంతరం అమర్‌నాథ్‌ను కొట్టి అతడి బంగారు ఉంగరం, బంగారు గొలుసుతో పాటు రూ.2 వేల నగదు, వైకుంఠంను కొట్టి రూ.2 వేల నగదు దోచుకుపోయారు. దీంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ చేయగా.. డొంబురుదొర కాజు మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతడు మే 14 నుంచి 31వ తేదీ వరకు సెలవులో ఉన్నాడు. అతడు మిల్లు యజమాని వైకుంఠానికి ఫోన్‌చేసి రూ.2 వేలు కావాలని అడిగాడు. అయితే వైకుంఠం డబ్బు లేదని చెప్పాడు. డొంబురు మిల్లుకు వెళ్లి డబ్బు కావాలన్నాడు. అయితే మిల్లు యజమాని నిరాకరించాడు. అందుకు డొంబురు ఆగ్రహించారు. ఈ మేరకు గతనెల 30వ తేదీ రాత్రి మిల్లు యజమాని మూమెంట్‌ను దుండగులకు తెలియజేశాడు. వారు దారికాసి డబ్బు, బంగారు గొలుసు, ఉంగర దోచుకున్నారు. బంగారాన్ని సెమిలిగుడలో అమ్మేందుకు ప్రయత్నించారు. అయితే వాటి బిల్లులు చూపించకపోవడంతో అమ్ముడు కాలేదు. అనంతరం ఒక గ్యారేజ్‌లో పనిచేస్తున్న ప్రఫుల్ల నాయిక్‌ బంగారు గొలుసు తనది అని చెప్పి ఒక ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఈ ఘటన ఆధారంగా ఒక్కొక్కరినీ అరెస్టు చేశామని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ కేసులో మరో వ్యక్తి ఉన్నాడని త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసుని ఎస్‌ఐ శిరిష్‌ మహాపాత్రో దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement