● 8 మంది అరెస్టు
రాయగడ: జిల్లాలో చిరుతపులి చర్మం అక్రమ కొనుగోలు, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాపై అటవీ శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించి 8 మంది నిందితులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో కలహండి జిల్లాకు చెందిన మునియా మాఝి, ఈజేరావు సాహు, సింహాద్రి తాడింగి, కల్యాణ సింగుపూర్‌కు చెందిన భరత్ నచిక, రాయగడ జిల్లా రివల్‌కొనకు చెందిన కై లాస్ జాని, చందిలికి చెందిన ప్రశాంత కడ్రక, ధర్మ పతిక, జితేంద్ర బెనియలు ఉన్నారు. కల్యాణ సింగుపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధి విరల్కన ప్రాంతంలో చిరుత పులి చర్మం విక్రయం జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయగడ, కలహండి జిల్లాలకు చెందిన అటవీ శాఖ సిబ్బంది శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చిరుతపులి చర్మం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రాయగడ రేంజర్ అనిల్ పాణిగ్రహి, కల్యాణ సింగుపూర్ రేంజర్ సచ్చిదానంద పరిడ, గౌరీ శంకర్ సాహు, రవిచంద్ర పాత్రో తదితర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


