శ్రీకాకుళం: ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేసి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఉన్నత, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో డీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ, ప్రజాసంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (ఎన్.టి.ఎ) రద్దు చేయాలని, నీట్ పరీక్షపత్రం లీక్ కావడంతో అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలో ఉంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న సిలబస్, కరికులం, విద్యా ప్రణాళికలను ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యను ఉమ్మడి జాబితాలో కాకుండా రాష్ట్ర జాబితాలో మాత్రమే ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు. నీట్ పేపర్ లీక్ కావడంలో కార్పొరేట్ విద్యా సంస్థల పాత్ర ఉందని, పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నా కేంద్రం మౌనం పాటించడం పట్ల వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ ప్రజాసంఘాల ఐక్య వేదిక ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని తీర్మానించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


