న్యూస్‌రీల్
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
జయపురం: పర్యావరణాన్ని కాపాల్సిన బాధ్యత అందరిపై ఉందని వక్తలు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ఆధ్వర్యంలో జయపురం అటవీ విభాగ అధికారులు శుక్రవారం నిర్వహించారు. జయపురం జిల్లా కోర్టు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవ ప్రదీకరణ అధికారి ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో జిల్లా ప్రధాన చికిత్సాలయ సభాగృహంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వన్య ప్రాణులు, పర్యావరణ సంరక్షణ చట్టాలను వివరించారు. సివిల్ జడ్జి, మహిళా కోర్టు విచారపతి అలోకానంద మహంతి, ప్రధమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హరమోహణ దాస్, జిల్లా అటవీ విభాగ జయపురం అధికారి ప్రశాంత పటేల్, జయపురం ప్రభుత్వ అటవీ విభాగ అధికారి డాక్టర్ అమిత్‌ప్రకాశ్ నాయక్, జిల్లా చికిత్సా అధికారి డాక్టర్ అక్షయ కుమార్ రౌత్, శిశు చికిత్స వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్ పాత్రో, ఆస్పత్రి మేనేజర్ రూపసీ మధుక్ష్మిత నాయక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆస్పత్రి, కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం జిల్లా కేంధ్ర హాస్పిటల్‌లో మొక్కలు నాటారు. విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు.
జయపురంలో..
జయపురం: ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా జయపురం స్వచ్ఛంద సంస్థ సోషల్ ఎడ్యుకేషనల్, ఎన్విరాన్‌మెంటల్ వెల్ఫేర్ అసోషియేషన్(సీవా) వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించింది. జయపురం సమితి పాత్రోపుట్ సమీపంలో కొంజాయి మాలిగుడ గ్రామంలో బొప్పాయి, మామిడి, నిమ్మ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జయపురం సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో..
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ హృషికేష్ సేనాపతి, రిజిస్ట్రార్ మహేశ్వర చంధ్ర నాయిక్ పర్యవేక్షణలో వివిధ జాతుల మొక్కలు నాటారు.
బీఎస్‌ఎఫ్ కార్యాలయంలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఎంవీ 3 గ్రామం వద్ద గల బీఎస్‌ఎఫ్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బెటాలియన్ 103,110, 177 బీఎస్‌ఎఫ్ బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా 2,900 వివిధ పండ్లు, స్థానిక జాతులకు చెందిన మొక్కలు నాటారు. బీఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ విజయ్ సిన్హా మొక్కల ప్రాధాన్యాన్ని వివరించారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం నుంచి రామసాగరం వరకూ పర్యావరణ చైతన్య ర్యాలీని డీఎఫ్‌ఓ కె.నాగరాజు ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్కూల్ విద్యార్థులు, అటవీశాఖ రేంజ్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రామసాగరం గట్టు మీద పలు మొక్కలను డీఎఫ్‌ఓ నాటారు. అనంతరం జిల్లా అటవీశాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో మాట్లాడారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్.. భవిష్యత్ వాతావరణం కోసం స్పూర్తితో ప్రకృతిని కాపాడుదాం..! అనే నినాదంతో పర్లాకిమిడి, కాశీనగర్ అర్బన్‌లో అనేక చోట్ల మొక్కలు నాటుతామని అన్నారు. మోహన ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం కాపాడటానికి మహేంద్రగిరిపై హెర్బల్ ప్లాంటేషన్ చేయాలని, టూరిజం స్పాట్‌గా కాకుండా తీర్థ స్థలంగా రూపొందించాలని ఆయన ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించానని అన్నారు.
ప్రకృతి మిత్ర, ప్రకృతి బంధు ఆవార్డులు అందజేత
జిల్లాలో పలు సమితిలలో చెట్లుపెంచి, సంరక్షణ చేస్తున్న సేవలకు గుర్తించి పలువురికి ప్రకృతి బంధు, ప్రకృతి మిత్ర పురస్కారాలను డీఎఫ్‌ఓ నాగరాజు ఎమ్మెల్యే దాశరథి గోమాంగో చేతులమీదుగా అందజేశారు. ప్రకృతి బంధు అందుకున్న వారిలో రవీంద్ర సుబుధ్ధి, మమతా పాఢి (హెల్త్ విస్తరణాధికారి), మహేంద్రకుమార్ సాహు, (నువాగడ), ముక్తికాంత మల్లిక్ (ఉపాధ్యాయులు)లకు రూ.10వేల రూపాయల చెక్కు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే మరికోందరికి ప్రకృతి మిత్ర ఆవార్డుల క్రింత రూ.20వేల చెక్కులను నలుగురికి అందజేశారు.
కొరాపుట్‌లో..
కొరాపుట్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు రామ్‌చంద్ర ఖడం అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటక స్థలం ఉన్న కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి దేవమాలి పర్వతం వద్ద మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి దేవమాలి పర్వతారోహణ చేశారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రాస్పత్రిలో బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ లు మొక్కలు నాటారు.


