జయపురం: ఒడిశా రాష్ట్ర శిశు పరిరక్షణ ఆయోగ్ ద్వారా కోర్టు క్యాంప్ నిర్వహించారు. శిశు హక్కుల పరిరక్షణ, వాటి తక్షణ పరిష్కారం కోసం స్థానిక జయపురం సబ్ కలెక్టర్ సభాగృహంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన శిశు హక్కుల క్యాంప్ కోర్టులో 65 ఫిర్యాదులు నమోదైనట్లు నిర్వాహక అధికారులు వెల్లడించారు. రాష్ట్ర శిశు పరిరక్షణ ఆయోగ్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ బబిత పాత్రో అధ్యక్షతన జరిగిన క్యాంప్ కోర్టులో ఆయోగ్ సభ్యులు సుజాత నాయిక్, కస్తూరీ మిశ్ర, మనస్మిత ఖుండియ పాటు న్యాయ సలహాదారు మహ్మద్ అబుదూల్ రెహమాన్, కొరాపుట్ జిల్లా అదనపు కలెక్టర్ తపన కుమార్ నాయిక్ క్యాంప్ కోర్టులో పాల్గొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో శిశువులకు సంక్షేమ పథకాలు అందడం లేదనే ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. శిశు విద్యావ్యవస్థ అనేక లోపాలున్నాయని, రేషన్ కార్డుల పంపిణీలో సమస్యలపైన కూడా ఎక్కువ ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. కొరాపుట్ జిల్లా పాఠశాలో ఎక్కువగా ఉన్న డ్రాపౌట్స్‌పై డాక్టర్ బబిత పాత్రో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
క్యాంప్ కోర్టులో బాలికపై దాడి కేసు
ఒడిశా శిశు హక్కుల పరిరక్షణ ఆయోగ్ క్యాంప్ కోర్టులో ఒక బాలికపై జరిగిన దాడి కేసు కూడా వచ్చింది. ఆ కేసుని పరిశీలించిన అధ్యక్షురాలు వంటనే పోలీసులను రప్పించి వెంటనే కేసు దర్యాప్తు జరిపి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్యాంపు కోర్టులో జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్,కొరాపుట్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్నేహ ప్రభ మఝి, జయపురం ఐటీడీఏ అధికారి తృప్తి బెహర, జయపురం బీడీఓ శక్తి మహాపాత్ర, జయపురం తహసీల్దార్ సబ్యసాయి జెన, జిల్లా విద్యాధికారి ప్రశాంత కుమార్ మహంతి, జయపురం శిశు సురక్షా అధికారి సంగీత రాణి పాణి, సీడబ్ల్యూసీ అధ్యక్షురాలు డాక్టర్ బి.గాయత్రీ దేవితో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


