విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి

జయపురం: విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయల కల్పన అవసరమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి అన్నారు. జయపురం మున్సిపాలిటీ పరిధి డెప్పిగుడ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు ఏర్పాటు చేయటంతోనే పిల్లలకు విద్యరాదని.. వారు చదువుకొనేందుకు తగిన తరగతుల గదులు, వనరులు, సౌకర్యాలు కల్పించటంతో పాటు తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొరాపుట్‌ జిల్లాలో అనేక పాఠశాలలకు తగినన్ని వసతుల్లేవని, ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహించడంతోపాటు ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. వసతులు, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు కనుమరుగౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుచేత ప్రభుత్వం అన్ని ప్రాధమిక పాఠశాలలో తగిన వసతులు కల్పించి అవసరమైనంత మంది ఉపాధ్యాయులను నియమించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. డెప్పిగుడ పాఠశాలలో మున్సిపాలిటీ అదనపు క్లాసురూమ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవటం ప్రశంసనీయమన్నారు. జయపురం మున్సిపల్‌ చైర్మన్‌ నరేంద్రకుమార్‌ మహంతి, బైస్‌ చైర్మన్‌ బి.సునీత, 8వ వార్డు కౌన్సిలర్‌ దేవేంద్రచౌధురి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement