పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని కాశీనగర్ బ్లాక్‌లో వంశధార నది, పురుటిగుడ నుంచి వస్తున్న 5 టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు ఇసుక లోడులను బుధవారం రాత్రి, గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో పర్లాకిమిడి రాయిచెట్టు జంక్షన్, స్టేట్ హైవే వద్ద పోలీసులు పట్టుకుని ఆదర్శ స్టేషన్‌లో ఉంచారు. అందులో రెండు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళానికి చెందిన మా నా నీలాద్రి ట్రాన్స్‌పోర్ట్ టిప్పర్లు ఉన్నాయి. అక్రమంగా ఇసుకను ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లు రాయల్టీ, ట్యాక్సు ఫీజు, నకిలీ చలానాలు ఎలాంటివి లేవని, అలాగే ఇసుక ఓవర్‌లోడింగ్, ప్రభుత్వ ఖనిజ సంపద దోచుకుని దొంగతనంగా రవాణా చేస్తున్నట్టు పోలీసు నిర్ధారించారు. ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు చాలా నష్టం కలుగుతుందని, పోలీసు అధికారులు విలేకరులకు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్ కేసు నంబర్ 199, 200, 201, 202, 203, 204 205, 206 కింద 13మందిని అరెస్టుచేసి, గురువారం మధ్యాహ్నం కోర్టుకు తరలించారు. ఇసుక టిప్పర్లు అక్రమంగా తరలిస్తున్న డ్రైవరు సురేష్ శోబోరో, ఎస్.విజయకుమార్, డ్రైవర్ దినేష్ గౌడో, డ్రైవరు ప్రకాష్ గౌడో, యజమాని దివాకర్ గౌడోలను కోర్టుకు తరలించారు. అక్రమంగా ఇసుకను ఒడిషానుండి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్టు దర్యాప్తు తర్వాత తేలిందని ఐఐసి ప్రశాంత్ భూపతి తెలియజేశారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలియజేశారు.


