రాయగడ: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నేటి యువ గాయకులకు ఆదర్శంగా నిలుస్తారని స్థానిక స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎస్పీ బాలు జయంతి ఉత్సవాలు స్పందన సంస్ధ ఆధ్యర్యంలో స్వాగత్ రొడ్డు సమీపంలో గల శ్రీకోదండరామ మందిరంలో గురువారం సాయంత్రం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సినీ సంగీత చరిత్రలో బాలు ఒక యుగపురుషుడని, అలాంటి మహానీయుడు, గొప్ప గాయకుడు మళ్లీ పుట్టడం అసాధ్యమని పేర్కొన్నారు. తన మధురమైన గానంతో కొట్లాది మంది సినీ సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆయన లేని లోటు సంగీత ప్రపంచానికి తీరనిదని అన్నారు. సంస్థ కార్యదర్శి డాక్టర్ తులసీదాస్ అధ్యక్షత వహించగా సాంసృతిక విభాగం కార్యదర్శి కొండవలస కృష్ణమూర్తి పట్నాయక్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో పలువురు కవులు, గాయకులు, సాహితీ వేత్తలు ,వక్తలు పాల్గొని ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీత ప్రస్థానం, సినీ జీవిత విశేషాలు, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రస్తావించారు.


