రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల చెక్‌గేట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని సదరు సమితి తొలగుమ్మ గ్రామానికి చెందిన కాసాన కంజాక (24) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐఐసీ ప్రసన్నకుమార్ బెహరా తెలియజేసిన వివరాల ప్రకారం.. బుధవారం కాసాన బైక్‌పై పితామహల్ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో చెక్‌గేట్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన అతడిని అక్కడ గల ఆటో డ్రైవర్లు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


