రాయగడ: జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో స్థానిక కొల్లిగుడ సమీపంలో గల మైదానంలో ఈ నెల 19, 20 వ తేదీల్లో జరగనున్న ఉగాది ఉత్సవాలను పురష్కరించుకుని శనివారం లయన్స్ క్లబ్ ప్రాంగణంలో మిస్ ఉగాది పోటీలను నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లుగా జిల్లా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అందుకు అందరి సహకారంతో కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాయని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా అదే తరహా అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా ఉగాది వేడుకల్లో మహిళలు ఎంతో ఆసక్తిగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఇటు మహిళలకు ఆసక్తికరమైన పోటీలను నిర్వహించడంతో పాటు ఉగాది ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయడంలో వారు అందిస్తున్న అంకితభావం హర్షణీయమన్నారు. మన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉగాది వేడుకలు అందరూ ఊహించని విధంగా నిర్వహిద్దామని అన్నారు.
భారీ ఎత్తున ర్యాలీ
గత ఏడాదిలా ఈ సారి కూడా ఉగాది వేడుకల్లో భాగంగా ఉగాది రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్థానిక మజ్జిగౌరి మందిరం నుంచి నిర్వహించే భారీ ర్యాలీలో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలొ యువతీ, యువకులతొ పాటు మహిళలు కూడా పాల్గొనాలన్నారు. మిస్ ఉగాది పోటీల్లో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా రుబి కుండు, ఎన్.లక్ష్మీ, ఎన్.
శారద వ్యవహరించారు. ఆధునిక దుస్తులతో కొందరు, సంప్రదాయ దుస్తులతో మరికొందరు పాల్గొన్నారు. సంబల్‌పూరి నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.


