భువనేశ్వర్: టోక్యో గ్లోబల్ ఫైనాన్షియల్ ఫోరంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఒడిశా విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై వారి అద్భుతమైన ప్రతిభని ప్రదర్శించారు. ఈ బృందం రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్య బన్షి సూరజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఫోరంలో రాష్ట్ర విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ, వ్యవస్థాపక ప్రాజెక్టు ప్రదర్శనలు విశేష గుర్తింపు సాధించడం రాష్ట్రానికి గర్వకారణం. సాధారణ స్రవంతిలో చదువుతున్న విద్యార్థులు డిగ్రీల సాధనకు పరిమితం కాకుండా వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో తమ సృజనాత్మకతను సమయోచితంగా ప్రయోగించేందుకు ఈ విజయం అద్దం పడుతుందని మంత్రి ప్రసంశించారు.
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ – ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఫైనాన్స్, గ్లోబల్ ఫైనాన్స్ – టెక్నాలజీ నెట్‌వర్క్ సహకారంతో రాష్ట్రంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం ఫిన్‌టెక్, ఇన్‌సర్‌టెక్‌లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 195 మంది విద్యార్థులు వివిధ క్యాప్‌స్టోన్ ప్రాజెక్టులలో పాలుపంచుకున్నారు. వారిలో అగ్రస్థానంలో నిలిచిన 7 మంది సభ్యుల బృందం టోక్యో గ్లోబల్ ఫైనాన్షియల్ ఫోరంలో తమ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించడానికి ఎంపికై ంది. ఈ బృందం సభ్యులలో రెవెన్షా విశ్వవిద్యాలయం నుంచి బి.సిమ్రాన్, రాజేశ్వరి బెహెరా, పుష్పాంజలి బెహెరా, మనీషా లెంకా మరియు సౌమ్య రంజన్ బైత, ఉత్కళ విశ్వవిద్యాలయం నుండి శివాన్షి నాయక్, సాలేపూర్ అటానమస్ కళాశాల నుండి అర్నిబన్ కొరొ ఉన్నారు. విద్యార్థులు ‘ట్రాంచిఫై – తదుపరి తరం ఎస్‌ఎంఈలకు ట్రస్ట్–బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ ప్లాట్‌ఫామ్‘ అనే ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. చిన్న, మధ్య తరహా సంస్థలు ( ఎస్‌ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్‌ను యాక్సెస్ చేయగల, బ్యాంకు రుణాలను మరింత సులభంగా పొందగల ప్రక్రియను సరళీకృతం చేయడం, డిజిటలైజ్ చేయడం ఈ ఫిన్‌టెక్ సొల్యూషన్ లక్ష్యంగా పేర్కొన్నారు.
ఫిన్‌టెక్, ఇన్‌సర్‌టెక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆర్థిక మరియు సాంకేతిక రంగాలలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధికి సహాయపడిందని విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చే శారు. ఒడిశా ప్రభుత్వం యొక్క చొరవ అంతర్జాతీయ వేదికపై తమ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించడానికి వీలు కల్పించిందన్నారు. రెండో దశ త్వరలో ప్రారంభం కానుంది. తదుపరి దశకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ఉన్నత విద్యా విభాగం తెలిపింది.


