బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ కీలకం | - | Sakshi
Sakshi News home page

బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ కీలకం

Mar 15 2026 1:28 AM | Updated on Mar 15 2026 1:28 AM

రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు

రాయగడ: రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీజూ స్వాభిమాన్‌ మంచ్‌ కీలకపాత్ర పోషిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీజూ స్వాభిమాన్‌ మంచ్‌ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. స్థానిక తేజస్వీ మైదానంలోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు సదరు సమితీలోని 27 పంచాయతీలకు చెందిన సర్పంచులు, సమితి సభ్యులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో భవిష్యత్‌ ప్రణాళికపై కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కొద్ది నెలల క్రితం బీజేడీ పార్టీకి గుడ్‌బై చెప్పిన నెక్కంటి అనంతరం తన అనుచరులతో కలిసి బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన మద్దతుదారులు, అభిమానులతో మమేకమై బీజేడీకి రాజీనామా చేసి ఆయన వెంట నడిచారు. అయితే తనను నమ్ముకున్న వారి కోసం తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని అన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని అన్నారు. తనను నమ్ముకుని ఉన్నవారికి సరైన మార్గాన్ని చూపించడం కోసమే బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ పేరిట సంస్థను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్వాభిమాన్‌ మంచ్‌లో కార్యకర్తలుగా కొనసాగుతున్న వారిలో అందరి అనుమతితో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి పంచాయతీ ఎన్నికల్లో మంచ్‌ తరఫున పోటీ చేసేందుకు తాను పూర్తి సహకారాన్ని అందిస్తానని అన్నారు. కేవలం రాయగడలో కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తమ మంచ్‌ ఉనికిని చాటుకునే విధంగా నిర్వీరామంగా కృషి చేస్తానన్నారు. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల పోరులో మంచ్‌ కార్యకర్తలు దూసుకెళ్తారని.. అందులొ ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది వేరే పార్టీలో చేరారని అన్నారు. ఎవ్వరినీ తన వెంట ఉండాలని ఏనాడు కోరడం లేదని.. ఎవరు తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్నారో అటువంటి వారితో తన భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించి ముందుకు కొనసాగుతానని స్పష్టం చేశారు. సమావేశంలొ మాజీమంత్రి లాల్‌ బిహరి హిమిరిక, రాయగడ సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, ఉపాధ్యక్షుడు హరప్రసాద్‌ హెప్రుక, తిరుపతి భనగాటి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement