శ్రీముఖలింగంలో తోపులాట
జలుమూరు: సంక్రాంతి నేపథ్యంలో ముక్కనుమ రోజున శ్రీముఖలింగంలో తోపులాట జరిగింది. దేవదాయ శాఖ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో దక్షిణ ద్వారంతోపాటు తూర్పు ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తులు తెలిపిన వివరాలు ప్రకా రం.. ఉదయం 9 గంటల తర్వాత ఆలయ ఈఓ ఏడుకొండలు శ్రీకాకుళం వెళ్లిపోగా భక్తులు గర్భగుడిలోని గోలెం వద్దకు అధిక సంఖ్యలో వెళ్లారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయం నుంచి వెళ్లే భక్తులకు ఒకటే మార్గం అయిపోవడంతో తోపు లాట జరిగింది. దర్శనానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. కొందరు అర్చకులతోనూ వాగ్వాదానికి దిగారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా.. డీసీ సంబంధిత ఈఓతో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి రద్దీని అదుపు చేశారు.


