ధాన్యం మండీ ప్రారంభం
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి డుడుమేట్ల, పాత చిమిటాపల్లి, తార్లకోట పంచాయతీల ప్రజల కోసం డుడుమేట్లలో ధాన్యం మండీని మంగళవారం ప్రారంభించారు. ల్యాంప్స్ ఎండీ అభిమన్యు హల్వా, కోరుకొండ ఆహార సరఫరా ఇన్‌స్పెక్టర్ హరీష్ మల్లిక్ తదితరులు మండీని ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండీ నిర్వహిస్తారన్నారు. ఒక్కరోజులో ఒక్క మండీలో గరిష్టంగా 40 క్వంటాళ్ల ధాన్యం విక్రయించవచ్చునన్నారు. రైతులు పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ మాధవ్ మాడ్కామి, సమితి సభ్యురాలు సవితా దాస్, కోరుకొండ సమితి మాజీ అధ్యక్షుడు సుభాస్ పడియామీ తదితరులు పాల్గొన్నారు.
హిందువులపై
దాడులను ఆపాలి
జయపురం: బంగ్లాదేశ్‌లో భారతీయ హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి హిందూ జాగరణ మంచ్ సభ్యులు కోరారు. ఈ మేరకు బొరిగుమ్మలో భారీ ర్యాలీ మంగళవారం నిర్వహించి రాష్ట్ర గవర్నర్‌కు ఉద్దేశించిన వినతిపత్రం తహసీల్దార్ కార్యాలయంలో అదనపు తహసీల్దార్ బొనాయి సతీష్‌కు అందజేశారు. బంగ్లా దేశీయులు హిందువుల మానవ హక్కులను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బొరిగుమ్మ హిందూ జాగరణ మంచ్ కార్యకర్తలు ప్రపుల్ల కుమార్ దండసేన, లిలు బిశ్వాల్, మోహన దొర, త్రిపతి పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు రూరల్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జక్కల తోష్నిరాయ్ ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. రోలర్ స్కేటింగ్ స్పోర్ట్స్ వీక్ నేషనల్ చాంపియన్‌షిప్–2025 పోటీలలో 300 మీటర్ల రోలర్ స్కేటింగ్ విభాగంలో ఈమె సత్తాచాటింది. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన జక్కల గోపాలకృష్ణ, చంద్రవతి దంపతుల కుమార్తె తోష్నిరాయ్ ప్రతిభ కనబరచడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.
మత్తు పదార్థాలతో జీవితం చిత్తు
శ్రీకాకుళం: డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై రిమ్స్‌లోని సైకియాట్రిక్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. డాక్టర్లు రవి, గోపీచంద్, పద్మ, అఖిల, దీపక్ తదితరులు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. వీరంతా ఆయా మండలాల్లోని పాఠశాలలు, విద్యాసంస్థలను సందర్శించి అక్కడి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవిబాబు మాట్లాడుతూ మత్తు పదార్థాల బారిన పడి విద్యార్థులు విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. సమావేశంలో పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ధాన్యం మండీ ప్రారంభం
ధాన్యం మండీ ప్రారంభం


