ఆదివాసీ సంగ్రహాలయం ప్రారంభం
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి కేంద్రంలో ఉన్న భారతీయ విద్యా నికేతన్ గురుకుల పాఠశాలలో ఆదివాసీ సంగ్రహాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఆదివాసీలు ఎక్కువగా ఉండడంతో వారి సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని కాపాడే లక్ష్యంతో ఇండియా ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ బెంగుళూరు సంస్థ ఆర్థిక సహకారంతో ఇండియా ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి.ఎనన్.కృష్ణమూర్తి ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుత, రానున్న తరాలకు ఆదివాసీ సంప్రదాయాలు గురించి తెలియజేయడమే లక్ష్యమన్నారు. ఆదివాసీల ఆభరణాలు, చేతితో నేసిన వస్త్రాలు, సంప్రదాయ వాద్య పరికరాలు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, వేటకు ఉపయోగించే ఆయుధాలు తదితర సమాచార పలకలతో అందంగా అలంకరించి ప్రదర్శించారు. విద్యార్థులు ఆదివాసీ వస్త్రధారణలో ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సుకాంత కుమార్ పండా, కలిమెల సమితి మాజీ అధ్యక్షుడు మాలా మాఢీ, గంగాధర్ సోడి, డీఎల్వో లవిత్ మడ్కమి, కలిమెల సమితి ఆదివాసీ మహా సంఘ అధ్యక్షుడు వాగా మాడ్కమి, కలిమెల జెడ్పీ సభ్యురాలు మమాతా పడియమి, కలిమెల ల్యాంప్ అధ్యక్షుడు బుద్రకాబాసి తదితరులు పాల్గొన్నారు.


