
అమరుల త్యాగం జాతి మరువదు
● రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి
కొరాపుట్: స్వాతంత్య్ర పోరాటంలో బలి దానాలు ఇచ్చిన వారి త్యాగం జాతి మరువదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి పేర్కొన్నారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి టురి నది వద్ద అమరుల స్మారక స్థూపం వద్ద జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1942 ఆగస్టు 24వ తేదీన టురి నదిని దాటడానికి ప్రయత్నం చేసిన స్వాతంత్య్ర పోరాట యోధులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. వారి జ్ఞాపకార్థం ఏటా ఇక్కడ అమరులు కుటుంబాలతో సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం నుంచి స్వాతంత్య్ర పోరాట యోధుల కుటుంబాల సంఘం ఆధ్వర్యంలో అమర జ్యోతితో ర్యాలీ జరిగింది. ఈ జ్యోతిని పపడాహండి వద్ద మంత్రి అందుకొని స్థూపం వద్ద వెలిగించారు. టురి నది వద్ద అమరులకు పిండ తర్పణం జరిగింది. సర్వమత ప్రార్థనతో ఆత్మశాంతి కోసం మౌనం వహించారు. పోలీసులు తుపాకులతో వందనం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి,నర్సింగ్ బోత్ర,మనోహర్ రంధారి, మాజీ ఎంపీలు పరశురాం మజ్జి,భగవాన్ మజ్జి, ప్రముఖులు మున్నా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

అమరుల త్యాగం జాతి మరువదు

అమరుల త్యాగం జాతి మరువదు

అమరుల త్యాగం జాతి మరువదు