
● బీజేడీ ఆందోళన
జయపురం: స్థానిక జయనగర్ కూడలి వద్ద జయపురం బీజేడీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన ఈ ధర్నాలో ఒకటి, రెండో వార్డు ప్రజలు, బీజేడీ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్నా సమయంలో ఈ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ ధర్నాలో మాజీ మంత్రి, రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షుడు రబినారాయణ నందో పాల్గొని ప్రసంగించారు. జయపురం లక్ష్మీ ఇందిర పండా కూడలి నుంచి జయనగర్ మీదుగా పీహెచ్‌డీ ఆఫీసు వరకు గల 2.20 కిలో మీటర్ల రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. ఈ రోడ్డును బాగు చేయాలని ఎంతో కాలంగా తాము డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం రోడ్లు, భవనాల విభాగం రూ.13.10 కోట్లు మంజూరు చేశారన్నారు. నేడు రోడ్డు పరిస్థితి అతి దారుణంగా ఉందన్నారు. రోడ్డు నిర్మాణంలో సంబంధిత వివిధ ప్రభుత్వ విభాగల మధ్య సమన్వయం లేకపోవటమే ఈ పరిస్థితికి కారణమని నిందించారు. ఈ రోడ్డు నిర్మాణంలో ఆర్‌అండ్‌బీ, మత్య్స, టాటా విద్యుత్, అటవీ, మైనర్ ఇరిగేషన్, జయపురం మునిసిపాలిటీ డిపార్టుమెంట్‌ల మధ్య సమన్వయం లేదన్నారు. నేటికీ ఈ మార్గంలో చెట్లు తొలగించడం జరగలేదని, రోడ్డు మధ్య గల విద్యుత్ స్తంభాలు తీయటం లేదని, జల విభాగ పైపులు తొలగించటంలేదని, ఉద్యానవన విభాగం స్థలం నివ్వడం లేదని, ఇతర ప్రభుత్వ విభాగాలు సహకరించకడం లేదన్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ విభాగం రోడ్డు నిర్మాణంలో మార్పులు చేయలేకపోతుందని ఆరోపించారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు జరగటం లేదన్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు చేపట్టి, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డు పనులు పూర్తిచేయాలని, లేకపోతే బీజేడీ ప్రజాందోళన చేపడుతుందని హెచ్చరించారు. ధర్నాలో జయపురం మునిసిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ బి.సునీత, కౌన్సిలర్లు పి.పద్మా రెడ్డి, హరి మిశ్ర, మాధవ రథో, మాధవ మహంకుడొ, ఒకటో వార్డు కౌన్సిలర్ ప్రతినిధి నాగరావు, నేతలు హరికృష్ణ, బాలా రాయి, మహేంద్ర అధికారి, చింటు పాణిగ్రహి, జిల్లా పరిషత్ మాజీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

● బీజేడీ ఆందోళన

● బీజేడీ ఆందోళన