
ఓఏఎస్ అధికారిని అంటూ వచ్చి ఆత్మహత్య
కొరాపుట్: ఒడిశా రాష్ట్రంలో అత్యన్నత ఒడిశా అడ్మిస్ట్రేటివ్ అధికారిని అని వచ్చి ఒక యువకుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మీరా ఆటో చౌక్ సమీపంలో శుభం అపార్ట్‌మెంట్‌లో సుందర్ గఢ్ జిల్లా బడగావ్‌కి చెందిన దిల్ రంజన్ పాటి (24) ఉరి వేసుకొని ఆదివారం ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తాను ఓఏఎస్‌కి క్వాలిఫై అయ్యానని చెప్పి అపార్ట్‌మెంట్‌లో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. రెండు నెలలుగా అక్కడే నివసిస్తున్నాడు. ఉదయం నుంచి తండ్రి ఫోన్ చేసినప్పటికీ ఎత్తక పోవడంతో అపార్ట్‌మెంట్ యజమానికి సమాచారం ఇచ్చాడు. యజమాని సూచనతో అపార్ట్‌మెంట్ గార్డు వెళ్లి కిటికీలో నుంచి చూడగా దిల్ రంజన్ ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌డీపీవో కృష్ణచంద్ర బోత్ర సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని బయటకు తీస్తామని పోలీసులు వెల్లడించారు.
డుడుమా జలపాతంలో యూట్యూబర్ గల్లంతు
కొరాపుట్: ప్రఖ్యాత డుడుమా జలపాతంలో పడి యూట్యూబర్ గల్లంతయ్యాడు. కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి వనక ఢిల్లి సమీపంలోని డుడుమా జలపాతంలో పడి బ్రహ్మపుర పట్టణానికి చెందిన యూట్యూబర్ సాగర్ కుడు (25) ఆదివారం గల్లంతయ్యాడు. సహచర బృందంతో కలిసి నది మధ్యలో డ్రోన్ సహాయంతో వీడియో చిత్రీకరణ జరుగుతుండగా.. ఇదే సమయంలో మాచ్‌ఖండ్ డ్యాం గేట్లు ఎత్తి వేశారు. ఇది చూసిన పర్యాటకులు పెద్ద ఎత్తున్న కేకలు వేశారు. పరిస్థితి అర్థం చేసుకునే సరికి నీరు పోటెత్తెంది. స్థానికంగా ఉన్న పర్యాటకులు రక్షించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేక పోయింది. దీంతో సాగర్ నది నుంచి 550 అడుగుల కిందకు వెళ్లి పోయాడు. ఇది తెలిసిన అగ్నిమాపక, ఒడ్రాఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం రాత్రి వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు.
192 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు శనివారం రాత్రి కటాపల్లి గ్రామ అడవి ప్రాంతంలో 192 కిలోల గంజాయితో ఉన్న బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం ఐఐసీ దీరాజ్ పట్నాయక్‌కు అటవీ ప్రాంతలో గంజాయి బస్తాలు ఉన్నట్టు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. దీంతో ఎస్సై మనోహర్ సాహు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బెజాంగ్‌వాడ పంచాయతీ కటాపల్లి గ్రామ అటవీ ప్రాంతానికి పంపించారు. పోలీసులు అటవీ ప్రాంతంలో గాలించి తొమ్మిది బస్తాల్లో ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన గంజాయి మాఫీయా పరారైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలను బలిమెల పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ పది లక్షల రూపాయలు ఉంటుందని ఐఐసీ దీరాజ్ పట్నాయక్ తెలిపారు.

ఓఏఎస్ అధికారిని అంటూ వచ్చి ఆత్మహత్య

ఓఏఎస్ అధికారిని అంటూ వచ్చి ఆత్మహత్య