
కర్మయోగి పాఠాలపై ఒత్తిడి తగదు
పొందూరు: గత మే నుంచి ఐగాట్ కర్మయోగి పాఠాలు వీక్షించి తీరాలని ఉపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి తేవడం సమంజసం కాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న అన్నారు. పొందూరులోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీడియోలు వీక్షించి ఎసెస్మెంట్‌లను పూర్తి చేసి సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, తొలుత నాలుగు పాఠాలని చెప్పి ప్రస్తుతం సుమారు 20 పాఠాలు వినాలని కలెక్టర్ కార్యాలయం నుంచి సందేశాలు పంపుతున్నారని తెలిపారు. 6 పాఠాలకు మించని ఉపాధ్యాయుల పేర్లను వాట్సాప్‌లో పంపి భయభ్రాంతులకు గుర్తి చేస్తున్నారని చెప్పారు. ఇంత వరకు ఏ ఒక్క అధికారి ఐగాట్ కర్మయోగి అంటే ఏమిటి? ఎందుకు ఇందులో వీడియో పాఠాలు వినాలి? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఒక్క పాఠం పది నిమిషాలు వినేసరికే 2జీబీ ఇంటర్నెట్ అయిపోతుందని, రోజంతా యాప్‌ల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి తీసుకొస్తూ ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
యువకుడిపై కేసు నమోదు
శ్రీకాకుళం రూరల్: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువకుడు మోసం చేశాడంటూ మోపసుబందరు గ్రామానికి చెందిన ఓ యువతి శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోపసుబందరు గ్రామానికి చెందిన యువతి సరసన్నపేట మండలం ఊటపేటలోని తాతయ్య ఇంటి వద్ద ఉంటూ ఇంటర్మీడియట్ చదివింది. ఆ సమయంలో పక్క గ్రామమైన ముసిడిగట్టుకు చెందిన సింహాద్రితో పరిచయం ఏర్పడింది. ఇంటర్ పూర్తయ్యాక కూడా ప్రేమ కొనసాగించారు. కొన్ని నెలల క్రితం సింహాద్రికి ఉద్యోగం రావడంతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ రాము ఆదివారం కేసు నమోదు చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
పొందూరు: కనిమెట్ట పంచాయతీ రాందాసుపురం గ్రామానికి చెందిన పేడాడ అప్పలనాయుడు(60) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు భార్య అప్పలనరసమ్మతో కలిసి హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. తాగుడుకు బానిసయ్యాడు. వారం కిందట గ్రామానికి వచ్చి మద్యం తాగుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. హైదరాబాద్ వచ్చేయాలని భార్య చెప్పినా వినకుండా మద్యం తాగుతూ తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంటి ముందు తాడుతో ఉరేసుకుని మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
న్యాయం చేయాలని ఫిర్యాదు
పలాస : పలాస సూదికొండ కాలనీకి చెందిన ఓ జీడి కార్మికురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. తాను పనిచేసే జీడిపిక్కల బడ్డీలో గుమస్తాగా పనిచేసిన పలాస అన్నపూర్ణాశ్రమ వీధికి చెందిన జామి నరేష్ పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా నమ్మించి మోసం చేస్తున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని కోరింది.

కర్మయోగి పాఠాలపై ఒత్తిడి తగదు