
22న ధర్మశాల మండల అధ్యక్షునిపై అవిశ్వాస తీర్మానం
భువనేశ్వర్: ధర్మశాల మండల అధ్యక్షుడు ప్రభాత్ బల్వంత్రాయ్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదించారు. ఈ నెల 22న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ఈ నెల 11వ తేదీన, మండలంలో చెందిన 38 మంది సర్పంచ్‌లు, సమితి సభ్యులు మండల అధ్యక్షుని వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం దాఖలు చేశారు.
విద్యుత్ షాక్‌తో ఇద్దరికి గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన ఓ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా అదే వీధికి చెందిన జోగి చందు, దేవాది లోహిత్‌లు కడుతుండగా విద్యుత్ వైర్లు తాకడంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఇద్దరూ గాయపడటంతో వెంటనే స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
టెక్కలి రూరల్: స్థానిక మెళియాపుట్టి రోడ్డు సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆదివారం వేకువజాము ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. కాకినాడ నుంచి పశ్చిమబెంగాళ్ వైపు వెళ్తున్న ట్యాంకర్ టెక్కలి సమీపంలో ముందు వెళ్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి అప్రోచ్ రోడ్డు మీదుగా సమీపంలో పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ జి.సూరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.
నగర కళింగ కోమటి సంఘ అధ్యక్షుడిగా కోరాడ హరిగోపాల్
శ్రీకాకుళం : నగర కళింగ కోమటి సంఘ అధ్యక్షుడిగా కోరాడ హరిగోపాల్ ఎంపికయ్యారు. గత 15 రోజులుగా అధ్యక్ష ఎంపికపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పదవి కోసం పలువురు పోటీ పడగా చివరికి కోరాడ హరిగోపాల్, ఊణ్న సర్వేశ్వరరావు, కోరాడ రమేష్ మధ్య పోటీ ఏర్పడింది. ఆదివారం కళింగ వైశ్య సంఘం సమావేశం నిర్వహించగా రాష్ట్ర, జిల్లా సంఘ నాయకులు హాజరయ్యారు. ఆశావాహులంతా తమకే పదవి కావాలని పట్టుబట్టారు. కాగా, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వీరి ముగ్గురితో ప్రత్యేకంగా సమావేశమై రాజీకుదర్చడంతో హరిగోపాల్‌ను నగర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సర్వేశ్వరరావు, రమేష్‌లకు సముచిత స్థానం కల్పిస్తామని హామీఇచ్చారు. హరిగోపాల్ ప్రస్తుతం వర్తక సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘానికి ఇప్పటివరకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు.