
చెరువు కాదు.. పాఠశాలే..
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా సమితిలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుండిమా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు సెలవు ప్రకటిస్తున్నారు. గుండిమా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నవి రెండే తరగతి గదులు. మధ్యాహ్న భోజన పథకం వంటశాల కూడా ఇప్పటి వరకూ లేదు. వర్షాల వల్ల మిడ్ డే మీల్ బడి పిల్లలకు అందించడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ఈ పాఠశాలలో ఆదనపు తరగతి గదులు, పైకప్పు మరమ్మతులు చేపట్టాలని ప్రధానోపాధ్యాయుడు అనేక సార్లు జిల్లా ముఖ్యవిద్యాధికారి మాయాధర్ సాహుకు లేఖలు రాసినా ఫలితం లేకపోయిందని తెలియజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ మధుమిత తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.