
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
జయపురం: అడవులు తగ్గిపోవటంతో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, దీనిని అరికట్టాలంటే మొక్కలు నాటి సంరక్షించడం ఒక్కటే మార్గమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. జయపురం సమితి బొరిగుమ్మలో భైరవ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ‘తల్లి పేరున ఒక చెట్టు’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్, భైరవ డిగ్రీ కళా శాల బొరిగుమ్మ, అటవీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటరు నమోదును సరళీకృతం చేయాలి
భువనేశ్వర్: ఓటర్ల జాబితాలో నమోదు కోసం ప్రామాణికాలను సరళీకరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (ఎం) ఒడిశా రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం విన్నవించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించింది. అర్హులైన ఓటర్లందరినీ ఓటరు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. జాబితా నుంచి అర్హత ఉన్న పౌరుల్ని మినహాయించే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ప్రతినిధి బృందంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సురేష్ చంద్ర పాణిగ్రాహి, రాష్ట్ర సంపాదక బోర్డు సభ్యులు దుష్మంత కుమార్ దాస్, యమేశ్వర్ సామంతరాయ్, బద్రీనారాయణ్ దాస్, ఇతర నాయకులు ఉన్నారు.
ప్రయాణికుల బస్సు బోల్తా
● పలువురికి గాయాలు
భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లాలో అదుపు తప్పి ప్రయాణికుల బస్సు బోల్తా పడింది. తుముసింఘా పోలీస్ ఠాణా కొంతియాపుట్ సాహి వద్ద శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో వర్షాలు కారణంగా మట్టి కూరుకుపోవడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సొవాండా నుంచి ఢెంకనాల్‌కు వెళ్తున్న ఈ బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
బాబోయ్ పులి!
భువనేశ్వర్: సుందర్‌గఢ్ జిల్లా లెఫ్రిపడా అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. హల్మా పంచాయతీ ధంగెరేగుడి, కుంజునాల ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు భావిస్తూ పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
దేశభక్తిని చాటుకుందాం
రాయగడ : ఈ నెల 15న స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జరగను న్న స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించి దేశభక్తిని చాటుకుందామని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌చంద్ర నాయక్ పిలుపునిచ్చారు. స్థానిక సమితి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లా కలక్టర్ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ