వైభవంగా దేవీ యాత్ర
బరంపురం: భక్తుల కొంగు బగారం.. బరంపురం ఇలవేల్పు ‘మా బుధి ఠాకురాని’ అమ్మవారి (దేవీ యాత్ర) ఉత్సవాలు ఆదివారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం మేళతాళాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అమ్మవారిని పుర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తితో అమ్మవారి పాదాలను పసుపు నీళ్లతో కడిగారు. 26 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్పవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్థానిక పోలీసులు పటిష్టమైన బందోబస్టు నిర్వహించారు.
యోగాతో మానసిక వికాసం
జయపురం: యోగాతో మానసిక వికాసం కలుగుతుందని యోగా గురువు వికాశ షొడంగి అన్నారు. జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ బాలికోన్నత పాఠశాలలో ఇకో క్లబ్, ఫిట్ ఇండియా సంయుక్తంగా యోగా శిబిరం నిర్వహించాయి. ఈ శిబిరంలో కొట్ ప్రాంత ప్రముఖ యోగా గురువు వికాశ షొడంగి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. యోగాతో మన జీవన శైలి మారుతుందన్నారు. ప్రతిఒక్కరూ యోగాను అభ్యసించాలన్నారు. ఈ శిబిరంలో విద్యాలయ ఉపాద్యాయులు సబిత మదల, దమయంతి సాహూ, ప్రభాషిణి లిమల్, సయిత గొలారి, వణిత మహంతి, ప్రియదర్శిణి మండల్, పాఠశాల ఇకో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు సెంచూరియన్ వర్సిటీ ఉత్కళ కృషి మేళా
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో మూడవ వ్యవసాయ ఉత్కళ కృషిమేళాను సోమవారం నిర్వహిస్తున్నట్టు ఎం.ఎస్.స్వామినాథన్ అగ్రికల్చర్ కళాశాల డీన్ డాక్టర్ ఎస్.పి.నంద ఆదివారం తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, కలెక్టర్, ఐకార్ (ఢిల్లీ) డాక్టర్ జె.కె.జెన్నా హాజరవుతారన్నారు. వ్యవసాయ మేళాలో రెండు వేల మంది రైతులు పాల్గొంటారన్నారు.
కుక్కల దాడిలో జింక మృతి
కొరాపుట్: కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ డైలీ మార్కెట్ సమీపంలో జరిగింది. ఐదు జింకల కదలికలను స్థానికులు గమనించారు. వీధి కుక్కలు వాటిపై దాడిచేశాయి. నాలుగు జింకలు అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయాయి. ఓ జింక కుక్కల బారీన పడింది. గాయపడిన జింకను స్థానికులు పశువుల ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా జింక మృతి చెందింది. తీవ్రమైన ఎండల వలన నీరు, ఆహారం కోసం జింకలు పట్టణంలోనికి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు అభిప్రాయ పడ్డారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. జింకను పోస్టుమార్టం నిర్వహించారు. కుక్కల సమస్యపై తాము తరచూ మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదుల చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్ సిబ్బంది స్పందించారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటామని స్థానికులకు నచ్చజెప్పారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలోని ఊసవానిపేట గేటు సమీపంలో ఆదివారం రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్లే రైలులో ప్రయాణం చేస్తున్న అసోంకు చెందిన బలిన్ దుర(35) ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ జారిపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు జీఆర్‌పీ పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు.
వైభవంగా దేవీ యాత్ర
వైభవంగా దేవీ యాత్ర
వైభవంగా దేవీ యాత్ర


