పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల వితరణ
శ్రీకాకుళం అర్బన్: సంక్రాంతి సండగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పనిచేసే 14 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీఎన్ జ్యుయలరీస్ సౌజన్యంతో నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు కార్మికులకు వస్త్రాలు వితరణ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎస్‌ఎం ఎంపీ రావు, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం: కొండములగాంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ రెడ్డి వాసు 5100 పిడకలతో భారీ భోగి పిడకల దండ తయారు చేయించారు. 20 మంది చిన్నారులతో ఊరేగింపుగా దండను తీసుకొచ్చి భోగి మంట వద్ద సందడి చేశారు.
గడ్డికుప్పలు దగ్ధం
టెక్కలి రూరల్: పరశురాంపురంలో బుధవా రం జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్ కోరాడ కామేష్‌తో పాటు మరికొందరు సుమారు 5ఎకరాల గడ్డిని కుప్పలుగా పెట్టి ఉంచారు. బుధవారం మధ్యాహ్నం సమీప పొలంలోని వరి దుబ్బులు కాల్చేందు కు పెట్టిన మంట చెలరేగి పక్కనే ఉన్న గడ్డికుప్పలపై పడటంతో ఈ ప్రమాదం సంభవించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటల ను అదుపు చేశారు. అప్పటికే చాలావరకు కుప్పలు కాలిపోయాయి.
నందిగాం: గొల్లూరు గ్రామంలో పింఛన్‌దారుల సొమ్ములో కొంత మొత్తాన్ని పంచాయతీ కార్యదర్శి తన వద్దే ఉంచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జనవరి నెలకు సంబంధించి గొల్లూరు పంచాయతీలో సుమారు 120 పింఛన్లకు గాను రూ.5,32,500ను గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి హేమసుందర్‌కు అప్పగించారు. అందులో రూ.4,68,000 మేరకు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. మరి కొంత మంది పింఛన్‌దారులు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించిన రూ.64,500ను కార్యదర్శి తన వద్దే దాచుకున్నాడు. 3వ తేదీతో పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తయినప్పటికీ, మిగిలిన పింఛన్ డబ్బుల సంగతి మండల స్థాయి అధికారులకు తెలియజేయలేదు. ఈ విషయమై ఎంపీడీఓ కుమార్ పట్నాయక్ వద్ద ప్రస్తావించగా.. గొల్లూరు కార్యదర్శి హేమసుందర్ పింఛన్ డబ్బులు ఉంచేశారనే విషయం తనకు తెలియదన్నారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళంలోని తిలక్ నగర్‌లో ఉపాధి కొత్త చట్టం జీఓ కాపీలను భోగిమంటలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ల ఒత్తిడితోనే కొత్త చట్టం తెచ్చారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బి.కృష్ణమూర్తి, కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, పి.ప్రసాదరావు, కె.శ్రీనివాస్, ఎం.గోపి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేట : కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేయకుండా ఎన్నికల హామీలు తుంగలోనికి తొక్కడం దారుణమని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోజ్జాడ యుగంధర్ అన్నా రు. ఈ మేరకు బుధవారం నరసన్నపేటలోని ఉమామహేశ్వరాలయం వద్ద భోగి మంటల్లో మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు రూ.20 లక్షలు, నిరుద్యోగ భతి నెలకు రూ. 3000 ఇస్తామని ఇంతవరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల వితరణ
పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల వితరణ


