
బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి చాకుతో దాడి
● దేవరాపల్లిలో యువకుడికి గాయాలు
● నగదు, సెల్‌ఫోన్‌తో గుర్తు తెలియని వ్యక్తుల పరారీ
దేవరాపల్లి: తెల్లవారుజామున బస్సులు, ఇతర వాహనాలు లేకపోవడంతో లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ యువకుడిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చాకుతో దాడి చేశారు. అతడి వద్ద రూ.5 వేలతో పర్సును, సెల్‌ఫోన్‌ను ఎత్తుకుపోయారు. దేవరాపల్లిలో ఆదివారం వేకువ జామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం వెంకటరమణపేటకు చెందిన జవ్వాది శ్రీను(32) విశాఖ నుంచి దేవరాపల్లిలో తన అత్తవారింటికి శనివారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. కొత్తవలస వరకు బస్సులోను, అక్కడ నుంచి వావిలపాడు జంక్షన్ వరకు క్వారీ లారీ మీద చేరుకున్నాడు. అక్కడ ఏ వాహనం దొరక్కపోవడంతో దేవరాపల్లికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై దేవరాపల్లి వైపు వస్తుండగా, వారిని ఆపి తీసుకెళ్లాలని కోరాడు. అతడిని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని దేవరాపల్లిలో దించకుండా శారదా నది వంతెన వైపు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతడి జేబులో పర్సు, సెల్‌ఫోను ఇవ్వకపోతే చంపేస్తామంటూ చాకుతో బెదిరించారు. దీంతో భయబడిన శ్రీను రూ.5 వేలతో పర్సు ఇచ్చేసి, సెల్‌ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు అతనిపై చాకుతో దాడికి దిగారు. ఈ దాడిలో శ్రీను చేతి వేళ్లు, తలతోపాటు శరీరంలో పలు చోట్ల విచక్షణా రహితంగా తీవ్రంగా గాయపర్చారు. దాంతో సెల్‌ఫోను వారికిచ్చేసి ప్రాణభయంతో పరుగులు తీశాడు. అయినా అతడిని వెంబడించడంతో వంతెన దగ్గరలో ఇటుక బట్టీలు వద్దకు చేరుకుని, పెద్దగా కేకలు వేయడంతో అక్కడ వారంతా నిద్రలేచి చూసేసరికి దాడికి పాల్పడిన యువకులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శ్రీనును దేవరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కె. కోటపాడు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ డి. నాగేంద్ర కేసు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నామన్నారు.