
వైభవంగా గజపతి సునియా ఉత్సవం
భువనేశ్వర్: గురువారం నుంచి పూరీ గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ పాలన 69వ సంవత్సరం ప్రారంభమైంది. మరో వైపు ఉత్కళీయ సంవత్సరం 1433 ఆరంభం కావడం విశేషం. ఈ సందర్భంగా ఏటా పవిత్ర భాద్రపద శుక్ల పక్ష ద్వాదశి నాడు గజపతి రాజ భవనంలో ప్రత్యేకంగా సునియా ఉత్సవం జరుపుకోవడం ఆచారం. ఈ సందర్భంగా గజపతి రాజ నగరి ప్రాంగణంలోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గ, శ్యామ కాళి, రాధాకృష్ణ, నృసింహ తదితర దేవతలను గజపతి మహారాజా పూజించారు. దీన్ని గజపతి దేవార్చనగా పేర్కొంటారు. దేవార్చన తర్వాత మంగళ హారతి సమర్పించి సునియా ప్రత్యేక ఉత్సవం ప్రారంభించారు. ఈ ఉత్సవం పురస్కరించుకుని గజపతి మహారాజా సమక్షంలో కొత్త అంకం ఆవిష్కరణ జరిగింది, ఈ సందర్భంగా రాజ గురువు ఆధ్వర్యంలో గజపతి రాజ నగరి తరపున వరాహ నృసింహ, లక్ష్మీ నృసింహ చిహ్నాలతో కూడిన కొత్త బంగారు నాణెం ప్రవేశపెట్టారు.