నీకెంత ధైర్యం?.. మహిళా ఐపీఎస్‌తో డిప్యూటీ సీఎం వాగ్వాదం | Video Of Ajit Pawar Rebuking Woman IPS Officer Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

నీకెంత ధైర్యం?.. మహిళా ఐపీఎస్‌తో డిప్యూటీ సీఎం వాగ్వాదం

Sep 5 2025 9:06 AM | Updated on Sep 5 2025 10:07 AM

Video of Ajit Pawar rebuking woman IPS officer goes viral

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్‌ వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఐపీఎస్‌ అధికారిని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీకెంత ధైర్యం అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల ప్రకారం.. సోలాపూర్‌లో కర్మలా తాలూకాలోని కుర్దు గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో, ఇసుక తవ్వకాల విషయాన్ని స్థానికులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే.. సబ్-డివిజనల్ పోలీసు అధికారి ఐపీఎస్‌ అంజనా కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇంతలో పలువురు ఎన్‌సీపీ నేతలు అక్కడికి చేరుకని అంజనా కృష్ణతో మాట్లాడాలని చెప్పి ఆమెను అడ్డుకున్నారు. ఎన్‌సీపీ నాయకుడు ఒకరు.. ఈ విషయమై డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్‌ను సదరు అధికారికి ఇవ్వాలని అజిత్‌ సూచించగా.. అంజనా కృష్ణ ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. 

అయితే, అజిత్‌ పవార్‌ వాయిస్‌ను ఆమె గుర్తించలేదు. దీంతో, ఆగ్రహానికి లోనైన అజిత్‌.. ఆమెపై చిందులు తొక్కారు. నేను డిప్యూటీ సీఎంను.. నన్ను గుర్తించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా?. నీపై చర్యలకు సిద్ధంగా ఉండు అని హెచ్చరించారు. అనంతరం, తనకు వాట్సాప్‌లో వీడియో కాల్‌ చేయాలని సూచించారు. సదరు అధికారి వెంటనే వీడియో కాల్‌ చేయడంతో అజిత్‌ను చూసి మాట్లాడారు.

అయితే, ఆమె సమాధానం పవార్‌ను ఆగ్రహానికి గురిచేసింది. ఐపీఎస్ అధికారిపై చర్య తీసుకుంటామని బెదిరిస్తూ ఆయన ఎదురుదాడి చేశారు. ఈ సందర్బంగా అజిత్‌..‘నేను మీపై చర్య తీసుకుంటాను. నేనే మీతో మాట్లాడుతున్నాను అంటే మీకు సరదాగా ఉందా?. మీకు నిజంగా అంత ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫడ్నవీస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.

మరోవైపు.. ఈ ఎపిసోడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం, అజిత్‌ పవార్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో, రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ తత్కరే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా సునీల్‌ తత్కరే స్పందిస్తూ..‘అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అజిత్ దాదా సదరు అధికారిని మందలించి ఉండవచ్చు. ఆమె చర్యను పూర్తిగా ఆపాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. పవార్ ఎప్పుడూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరు అని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement