
నీకు ఎంత ధైర్యం? అంటూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఓ ఐపీఎస్ అధికారిణితో వాగ్వాదం సందర్భంగా ప్రశ్నించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ డేరింగ్ యంగ్ ఆఫీసర్ గురించి ఆరా తీస్తున్నారు.
2022–23 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనా కృష్ణ(26) స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ఓ చిన్నబట్టల దుకాణం నడిపిస్తున్నారు. తల్లి కోర్టు టైపిస్ట్‌గా పని చేస్తోంది. పూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్‌లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే అంజనాకు ఐపీఎస్ కావాలనే కల. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గణితంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆవెంటనే UPSC పరీక్షకు సిద్ధమైంది.

అదే సమయంలో అంజనా ఓ ప్రముఖ మలయాళ దినపత్రికలో ఇంటర్న్‌గా పనిచేసింది కూడా. మలయాళ సాహిత్యాన్ని ఐచ్ఛిక విషయంగా ఎంచుకుని, ఆంగ్ల మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసింది. అలా.. 2022 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంజనా ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా ప్రాంతంలో DSP (Deputy Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయితీతో పాటు ఉత్సాహం, పరిపాలనా నైపుణ్యం, దూకుడు వల్ల ఆమెకు స్థానికంగా మంచి పేరు దక్కింది.
అసలేం జరిగిందంటే..
రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే..
వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ క్రమంలో..

పవార్: నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.
అంజనా: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్‌లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్‌కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?
పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి.
अजित पवार- "इतना आपको डेयरिंग हुआ है क्या?"
जब DSP अंजना कृष्णा ने अजीत पवार से कहा, "मैं कैसे मान लूं कि आप डिप्टी चीफ मिनिस्टर हो, वीडियो कॉल करो" #Maharashtra #AjitPawar #MaharashtraPolice #AnjanaKrishna #NCP pic.twitter.com/WUnEtWlfRm— India TV (@indiatvnews) September 5, 2025
దీంతో పవార్‌కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. పవార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై పవార్ వర్గ నేత సునీల్ తట్కరే స్పందించారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చన్నారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదన్నారు.
ఇక ఈ ఘటనపై అంజనా కృష్ణ స్పందించాల్సి ఉంది. అయితే పవార్ స్వరం గుర్తించలేకపోయినందున నిర్ధారణ కోసమే కాల్ చేయాలని ఆమె కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంతో ‘నేరుగా కాల్ చేయండి’ అనే మాట ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించే సంకేతంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.