
భద్రతా సంస్కృతి పెంపొందించాలి
విద్యార్థుల్లో ..
భువనేశ్వర్: విపత్తు నిర్వహణలో భద్రత సంస్కృతి అత్యంత కీలకమని, ఆ సంస్కృతిని సిబ్బందితో విద్యార్థి వర్గంలో ప్రేరేపించడం అవాంఛనీయ సంఘటనల నివారణకు దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని అన్ని సంస్థల్లో అగ్నిమాపక చర్యల ఆడిట్‌ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అగ్నిమాపక, అత్యవసర సేవల శాఖను కోరారు. ఈ చర్య ఊహాతీత ప్రమాదాలపై సకాలంలో పటిష్టంగా స్పందించేందుకు సహకరిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో క్షతగాత్రులు మృత్యు సంఘటనల్ని నివారించేందుకు నిరంతర తనిఖీ (ఆడిట్) అనివార్యంగా పేర్కొన్నారు. రాజ్ భవన్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం విపత్తు సన్నద్ధత, ప్రతిస్పందనపై వివరణాత్మక ప్రదర్శన సందర్భంగా గవర్నరు పలు కీలక మార్గదర్శకాలను సూచించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్, అగ్నిమాపక, అత్యవసర సేవలు, హోమ్ గార్డ్ శాఖ డీఐజీ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని మాపక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, శిక్షణ తదితర భావి ప్రణాళికలు, కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రోబోటిక్ మానిటర్లు, అడ్వాన్స్‌డ్ రెస్క్యూ టెండర్లు, ఇన్సిడెంట్ కమాండ్ వెహికల్స్, హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్, ఇతర అధునాతన యంత్రాలతో కూడిన ఆధునిక పరికరాలను ప్రదర్శించారు. పూరీ జిల్లా రామచండి ప్రాంతంలో నేషనల్ వాటర్ రెస్క్యూ, వాటర్‌మ్యాన్‌షిప్ సెంటర్, కే–9 జాగిలాల స్క్వాడ్ మోహరించడంలో ఒడిశా దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచిందని అధికారులు గవర్నర్‌కు వివరించారు. అగ్నిమాపక లైసెన్సు మంజూరు, పరోక్ష వర్గాలు (థర్డ్ పార్టీ) భాగస్వామ్యం, రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విపత్తు సన్నద్ధత కార్యకలాపాల్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవడం శాఖ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.