
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్ జిల్లా పరిషత్తు స్కూల్లో బయాలజీ టీచర్‌గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 44 మందిని ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు పవిత్ర. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోబోతున్నారు. ఆట పాటలను మిళితం చేస్తూ బోధించే విధానానికి శ్రీకారం చుట్టారు పవిత్ర. పాఠ్యాంశాలకు అనుగుణంగా గేమ్స్ రూ΄÷ందించి విద్యార్థులకు బాగా అర్థం అయ్యేలా చేస్తున్నారు.
ఆడుతూ హాయిగా నేర్చుకునేలా...
బయాలజీ కాన్సెప్ట్స్‌ను తీసుకొని ఫైండ్ ద వర్డ్ సర్చ్, క్రాస్ వర్డ్ పజిల్స్ తదితర గేమ్స్ రూపొందించారు. పాఠం చెప్పిన తరువాత ఈ గేమ్స్ ఆడిస్తే విద్యార్థులకు కాన్సెప్ట్‌ను మరోసారి రిపీట్ చేసినట్లు అవుతుంది. ప్రతి దశను తెలుసుకుంటారు. ఆడుతూ నేర్చుకుంటారు కాబట్టి మరచి΄ోకుండా ఉంటారు.
విద్యా వారధి
అమెరికా వంటి దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో విద్యార్థులకు అర్థమయ్యేలా చేసేందుకు ‘విద్యా వారధి’ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. ‘విద్యా వారధి’లో స్కూల్ పిల్లలు అమెరికాలోని విద్యార్థులతో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు జూమ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. అమెరికాలో విద్య. బోధన విధానం, పదో తరగతి, ఇంటర్మీడియట్ తరువాత ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉంటాయి...మొదలైన విషయాలను అక్కడి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటారు.
వ్యక్తిత్వ వికాస డైరీ
విద్యార్థులు తమ డైరీలో సబ్జెక్ట్‌కు సంబధించిన అసైన్‌మెంట్స్ రాసుకుంటారు. కానీ ఈ స్కూల్ పిల్లల డైరీ ప్రత్యేకం. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తమ దినచర్య రాయాలి. తప్పు చేసినా, మంచి పని చేసినా రాయాలి. వారం రోజుల తరువాత డైరీలో రాసుకున్న విషయాలను విద్యార్థులే చదువుకునేలా చేస్తారు. వారం రోజుల్లో చేసిన మంచి పనులు, తప్పులు ఏమిటి? ఎలా ఉండాలనేది విద్యార్థులు స్వయంగా తెలుసుకుంటారు. తద్వారా వారిలో క్రమంగా సత్ప్రవర్తన పెంపొందుతుంది.
– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ