
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా అడవ పోలీస్‌స్టేషన్ పరిధిలో అడవ సెంటర్ వద్ద సోమవారం ఒక బైక్, ట్రాక్టరును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పిన్నీ కొడుకులైన అర్పితా మల్లిక్, కిసాన్ మల్లిక్‌లు పని మీద కొంధమాల్ జిల్లా బ్రాహ్మాణిగావ్ పంచాయతీ పురుగుడ గ్రామం నుంచి బైక్‌పై అడవ వస్తుండగా అకస్మాత్తుగా అడవ నుంచి వస్తున్న ట్రాక్టరును ఢీకొట్టారు. దీంతో వీరిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని అడవ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం మెడికల్‌కు తరలించారు. అడవ పోలీసులు సంఘటనా స్థలానికి విచ్చేసి బైక్, ట్రాక్టరును స్వాధీనం చేసుకుని కేసు రిజిస్టర్ చేసుకున్నారు.
ఒడిశా కార్మికుడి మృతి
పద్మనాభం: మద్దిలోని ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన హేమంత్ భుయ్(27) అనే కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మద్దిలో పోక శ్రీనివాసరావు ఇటుక బట్టీలో కూలి పనిచేయడానికి ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లా బాబాలజురి సమీపంలోని బంద బుజూరికి చెందిన హేమంత్ భుయ్ తన భార్య రోజి బామ్‌తో కలసి ఈ ఏడాది జనవరిలో వచ్చాడు. సోమవారం బట్టీలో పనిచేస్తుండగా హేమంత్ భుయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు వెంటనే 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే సరికి ఆయన మృతి చెందాడు. హేమంత్ గుండెపోటుతో మరణించినట్లు 108 సిబ్బంది నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు