ఆటో ఢీకొని వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని వృద్ధుడు మృతి

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

ఆటో ఢీకొని వృద్ధుడు మృతి రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం స్విమ్మింగ్‌ కోచ్‌పై పోక్సో కేసు బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్యాయత్నం

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): వాకింగ్‌ చేస్తున్న వృద్ధుడిని ఆటో బలంగా ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజిత్‌సింగ్‌నగర్‌ శివాలయం వీధికి చెందిన రేగిడి సన్నీబాబు(66) తన కుమారుడు సాయికృష్ణతో కలిసి హెయిర్‌ సెలూన్‌ షాపు నిర్వహిస్తుంటాడు. సన్నీబాబు మంగళవారం తెల్లవారుజామున తన స్నేహితుడైన బొచ్చు గంగరాజుతో కలిసి పైపుల రోడ్డు నుంచి వైవీ రావు ఎస్టేట్‌ ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో వాకింగ్‌ చేసేందుకు వెళ్లాడు. ఆరు గంటల సమయంలో ఇన్నర్‌రింగ్‌ రోడ్డులోని విక్రమ్‌ పబ్లిషర్స్‌ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. దీంతో సన్నీబాబు రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమవడమే కాక ముక్కు, చెవుల నుంచి రక్తస్రావమైంది. ఆటోతో ఢీకొన్న వ్యక్తి వెంటనే సన్నీ బాబును తన ఆటోలోనే సమీపంలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లిన కొద్ది సమయానికే సన్నీబాబు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సన్నీబాబు కుమారుడు సాయికృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. సాయికృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మైలవరం: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం పాలైన ఘటన మైలవరం మండలం పుల్లూరు హైస్కూల్‌ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మండలంలోని పుల్లూరు గ్రామ పంచాయతీ ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన తమ్మిశెట్టి వెంకయ్య(65) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దాసుళ్ళపాలెం గ్రామం వద్ద తాగునీరు తీసుకుని తన మోపెడ్‌ వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మైలవరం నుంచి ద్విచక్ర వాహనంపై రామచంద్రాపురం వెళుతుండగా పుల్లూరు హైస్కూల్‌ సమీపంలో ముందు వెళుతున్న వెంకయ్య వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకయ్య జాతీయ రహదారిపై కింద పడటంతో వెంకయ్య తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయింది. క్షతగాత్రుని స్థానికులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆరేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన స్విమ్మింగ్‌ కోచ్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంకలోని నల్లగేటు డౌన్‌లో ఓ వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కుమారుడు తల్లి వద్ద, కుమార్తె తండ్రి వద్ద ఉంటున్నారు. వారి ఇంటి సమీపంలో పున్నమి ఘాట్‌లో పిల్లలకు స్విమ్మింగ్‌ నేర్పించే కోచ్‌ చండూరి తేజ నివసిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారి తండ్రికి, తేజ మధ్య పరిచయం పెరిగి ఇద్దరూ కలిసి తరచూ మద్యం తాగేవారు. ఈ నెల ఎనిమిదో తేదీన దీపావళి రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం తేజ తన ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి బాలిక టపాసులు కాల్చుకుంటూ అంకుల్‌ అంటూ తేజ ఉంటున్న ఇంట్లోకి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న తేజ బాలికను దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మూడు రోజుల తర్వాత ఆ విషయం తండ్రికి తెలియడంతో చుట్టుపక్కల వారి సహాయంతో కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం పోక్సో చట్టం కింద మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

గన్నవరం: స్థానిక కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ మేనేజర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై గన్నవరం పోలీసులు విచారణ చేపట్టారు. స్థానిక కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ గన్నవరం బ్రాంచ్‌ మేనే జర్‌గా నార్కేడమిల్లి ఈశ్వర్‌ బ్యాంక్‌ ఉన్నతాధికారులు నిర్దేశించిన వ్యాపార లక్ష్యాలను చేరుకోవడంలో వెనుక బడడంతో కొంతకాలంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం బ్యాంక్‌ విధులకు హాజరైన ఈశ్వర్‌ తన వెంట తెచ్చిన పురుగుల మందు తాగి బాత్‌రూమ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని సిబ్బంది గమనించి సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement