ఓట్ల కోసం ప్రాణాలతో చెలగాటమా? | - | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసం ప్రాణాలతో చెలగాటమా?

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

ఓట్ల కోసం ప్రాణాలతో చెలగాటమా?

ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చిన

టీడీపీ నాయకుల అత్యుత్సాహం

విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి

తీవ్రంగా గాయపడిన హెల్పర్‌

వీధిలైట్లు వేయలేనోళ్లు ఓట్లు ఎలా అడుగుతారని దుగ్గిరాలపాడు గ్రామస్తుల నిలదీత

అధికారులకు చెప్పకుండా వీధిలైట్లు వేయించే ప్రయత్నం చేసిన

టీడీపీ నాయకులు

జి.కొండూరు: టీడీపీ నాయకుల అత్యుత్సాహంతో విద్యుత్‌ స్తంభంపై నుంచి పడిన హెల్పర్‌ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలోని దుగ్గిరాలపాడు గ్రామంలో జరిగింది. గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో వీధిలైట్లు వేయలేనోళ్లు ఓట్లు ఎలా అడుగుతారంటూ గ్రామస్తులు నిలదీశారు. దీంతో వీధి లైట్లు వేయించి ఓటర్ల దగ్గర క్రెడిట్‌ పొందాలని టీడీపీ నాయకులు భావించారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన టీడీపీ నాయకులు విద్యుత్‌ శాఖ అధికారులకు కూడా చెప్పకుండా వీధిలైట్లు వేయించేందుకు మంగళవారం ప్రయత్నించారు. గంగినేని గ్రామంలో విద్యుత్‌ హెల్పర్‌గా పని చేస్తున్న బలుగూరి లక్ష్మణ్‌ను దుగ్గిరాలపాడు గ్రామానికి పిలిపించారు. లక్ష్మణ్‌తో గ్రామంలో వీధిలైట్లు వేయిస్తుండగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి లక్ష్మణ్‌ స్తంభంపై నుంచి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి లక్ష్మణ్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

టీడీపీ నాయకుల అత్యుత్సాహంతోనే...

టీడీపీ నాయకుల అత్యుత్సాహం వలనే హెల్పర్‌కు తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా వీధిలైట్లు వేయాలంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆ బాధ్యతలు చేపడతారు. ముందుగా లైన్‌మన్‌కు తెలియజేసి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసిన తర్వాత వీధిలైట్లు వేసేందుకు చర్యలు చేపడతారు. అయితే దుగ్గిరాలపాడు గ్రామ పంచాయతీ సెక్రటరీ మనోజ్‌కి గానీ, లైన్‌మన్‌ బద్రునాయక్‌కి గానీ తెలియజేయకుండా టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయకుండానే వీధిలైట్లు వేసేందుకు ప్రయత్నాలు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై సెక్రటరీ మనోజ్‌, లైన్‌మన్‌ బద్రునాయక్‌లను వివరణ కోరగా దుగ్గిరాలపాడు గ్రామంలో వీధిలైట్లు వేసే విషయం తమకు తెలియదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement