ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఈనెల 24వ తేదీ కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ జరగనుంది. 24వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 5–55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఘాట్‌రోడ్డు వద్ద ప్రత్యేక పూల వాహనంపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితార సెంటర్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా గిరిప్రదక్షిణ ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణలో భక్తులు, అమ్మవారి సేవకులు విశేషంగా పాల్గొననున్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఖరీఫ్ 2026–27 సీజన్‌కు సంబంధించి మొత్తం 49,389 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 3,21,030 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉండగా, సుమారు 1లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 155 రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జేసీ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 31 నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ధాన్యం కొనుగోలు షెడ్యూల్‌ను వాట్సాప్ ద్వారా ముందుగానే తెలియజేసి, కొనుగోలు విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను తగినంతగా అందుబాటులో ఉంచాలన్నారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు అవసరమైన ప్రాంతాల్లో తగిన టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) లభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరువూరు డివిజన్‌లో 64, విజయవాడ డివిజన్‌లో 44, నందిగామ డివిజన్‌న్‌లో 47 కలిపి మొత్తం 155 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 77020 03571 ను సంప్రదించాలని సూచించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉద్యోగుల హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమం కోసం ఏపీఎన్జీవో నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపు, కరువు భత్యం (డీఏ) మంజూరు, ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పించే హెల్త్ కార్డుల సమర్థమైన అమలు వంటి కీలక అంశాలపై తాము నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉద్యోగులకు ఎన్జీవో సంఘం జేఏసీలోను ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ఏవైనా వాటి పరిష్కారం కోసం ఏపీ ఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఏఐఎస్‌జీఈఎఫ్ ఉమెన్ సబ్ కమిటీ సభ్యురాలు రాజ్యలక్ష్మి, రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సి.ఎం. దాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం.అక్కిరాజు ఎన్నికయ్యారు.
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): లైంగికదాడి కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విజయవాడకు చెందిన వై.సూర్యనారాయణ (68)పై 2008లో లైంగికదాడి అభియోగంపై కేసు నమోదైంది. అతడికి 2023లో జీవిత ఖైదీగా శిక్ష పడడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో జైలు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించి సూర్యనారాయణ మృతి చెందాడు. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


