మైలవరం(జి.కొండూరు): బస్‌స్టాండులు, రద్దీగా ఉన్న ప్రాంతాలను ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు మహిళా చోరుల ముఠాను మైలవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి మైలవరం పోలీసుస్టేషన్‌లో ఏసీపీ రామచంద్రరావు, సీఐ కిశోర్‌బాబు, ఎస్‌ఐలు సుధాకర్, గిరిసాయి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మైలవరం ఎస్‌వీఎస్ నగర్‌కు చెందిన శీలం రాజశేఖరరెడ్డి తన వ్యాపార నిమిత్తం కారును కొనుగోలు చేసేందుకు ఈ నెల 5వ తేదీన రూ.2.5 లక్షలను పసుపు రంగు బ్యాగులో పెట్టుకుని స్థానిక బస్‌స్టాండుకు వచ్చారు. రాజశేఖరరెడ్డి బస్సు ఎక్కే సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని బ్యాగు జిప్పు తెరిచి రూ.2.5లక్షలను ఐదుగురు మహిళా ముఠా చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి చోరీ ముఠా కోసం దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చోరీ ముఠాను గుర్తించి మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో మైలవరం మార్కెట్‌యార్డు సమీపంలో సంచరిస్తుండగా ఐదుగురు మహిళా చోరుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు నిందితులలో యర్రసాని వరలక్ష్మిపై రాష్ట్ర వ్యాప్తంగా 9 కేసులు, యర్రసాని అమృతపై 5 కేసులు, యర్రసాని కిట్టమ్మపై 3 కేసులు, కుంభ నాగమణిపై 2 కేసులు, కుంభ మేరీపై 1 కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులంతా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం యాగర్లపల్లికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా ముఠాగా ఏర్పడి గత ఐదేళ్లుగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.


