● 15న ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన ముగ్గురు బాలురు ● ముగ్గురిలో ఒకరు మృతి, ఇద్దరు పరారీ ● పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలుడు మృతి చెందాడు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని బందరురోడ్డులో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన మయాంక్, కావ్యాన్ష్, అభిషేక్ మిశ్రా పర్యాటకులుగా విజయవాడ వచ్చారు. వారి వయసు 16 లేదా 17 ఏళ్లు ఉంటుంది. ఈ నెల 15న బందరు రోడ్డులోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం లాడ్జి స్వీపర్ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా, మయాంక్(16) మంచం కింద నోటి నుంచి నురుగు వచ్చి విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. అప్రమత్తమైన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాడ్జి గదిని, సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. మయాంక్‌తో పాటు గదిలో బస చేసిన కావ్యాన్ష్, అభిషేక్ సోమవారం రాత్రి 1.30 గంటల సమయంలో లాడ్జి నుంచి లగేజీతో ఆటోలో రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. లాడ్జి గదిలో పదికి పైగా బీరు సీసాలను పోలీసులు గుర్తించారు. గదిలో దిగినప్పటి నుంచి మద్యం తాగి ఉండొచ్చని, మయాంక్‌కు హార్ట్‌ఎటాక్ వచ్చి లేదా మద్యం ఎక్కువై ఊపిరాడక మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే గానీ మృతికి కారణాలు తెలియవని పోలీసులు పేర్కొన్నారు. లాడ్జి యాజమాన్యం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు మైనర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.


