దిశ మార్చుకునే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉన్న యంత్రాంగం కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వరుసగా రెండు తుపాన్ల ధాటికి కుదేలైన ఉమ్మడి కృష్ణాజిల్లా రైతులు.. తాజాగా వస్తున్న అక్వాన్ తుపానుతో ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడంపై వారు దృష్టి పెడుతున్నారు. అర్నబ్, మురసు తుపాన్ల దెబ్బకు చాలాచోట్ల వరితో పాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మిగిలిన పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత ఈ తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ నెల 20న వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారుతుందని చెబుతున్నారు. ఇది మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని 1977 నవంబర్‌లో ఇదే తేదీన వచ్చిన ఉప్పెనలా ఉంటుందన్న ప్రచారం జరగడంతో జిల్లా వాసులు ఆందోళన చెందారు. అయితే తుపాను గంటకు కేవలం మూడు కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ కోనసీమ వైపు వెళ్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ముందస్తు ఏర్పాట్లు..
ఇప్పటికే ఈ తుపాను గమనం అంచనాలకు అందకుండా ఉండటంతో అది ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. తుపాను సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్లు ఆదేశించారు. తుపాను ప్రభావిత పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున, అతి తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలు అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.
విద్యుత్‌శాఖ అప్రమత్తం..
అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సంబంధిత సేవలను అందించేందుకు ఏపీ సీపీడీసీఎల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశించారు. ఎన్టీఆర్ సర్కిల్ కంట్రోల్ రూం నంబర్ 9440817561, గుణదల డివిజన్– 94910 52947, నూజివీడు డివిజన్– 73826 23234, విజయవాడ రూరల్– 73826 23229, విజయవాడ టౌన్–73826 23226కు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయవచ్చని చెప్పారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు, విద్యుత్ ప్రమాదాలు లేదా ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 18, 19 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాపై తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. వరి రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను చురుగ్గా నిర్వహించాలన్నారు. మార్కెట్ యార్డుల్లోని టార్పాలిన్లను అవసరమైన రైతులకు అందించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


