గన్నవరం: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంగళవారం జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వి.అభిషేక్ పరిశీలించారు. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల విధులు నిర్వహణకు క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవో కె.సాయిగోపాల్, పలువురు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. అలాగే స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు పరిశీలించారు. డీఎస్పీ కె.జయకృష్ణ, సీఐ బి.వి.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 15 లక్షల చేప పిల్లలను నదిలో విడుదల చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా మత్స్యశాఖ అధికారి సీఎస్ చక్రాని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో మత్స్యశాఖ అధికారులు చేప పిల్లలను మంగళవారం విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం జిల్లాలోని పెనమలూరు, మోటూరు ప్రభుత్వ మత్స్య విత్తన క్షేత్రాల నుంచి సేకరించిన నాణ్యమైన చేప పిల్లలను స్థానిక మత్స్య సహకార సంఘాల సభ్యుల సమక్షంలో నదిలో వదిలామన్నారు. ఈ చేపలు సుమారు కేజీ నుంచి 2 కేజీల వరకు పెరిగిన తర్వాత వాటిని పట్టుకుని సంపూర్ణ ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా మత్స్యశాఖ ఏడీ పీఎన్ కిరణ్ కుమార్, స్థానిక మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
వత్సవాయి: నూతన విధానంలో ఎరువులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి సీహెచ్ తిరుమలాదేవి తెలిపారు. ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలిజర్ సేల్(ఎఫ్‌ఎఫ్‌ఎస్)యాప్ ద్వారా ముందుగానే ఎరువులను బుక్ చేసుకోవాలి, రైతులు గ్రామ వ్యవసాయ సిబ్బంది సహకారంలో పూర్తిచేసుకోవచ్చు బుకింగ్ పూర్తయిన తరువాత ప్రతి దుకాణానికి సంబంధించిన క్యూఆర్ కోడ్, టోకెన్ నంబర్ జారీ అవుతాయి. టోకెన్ జారీ అయిన 48 గంటల లోపు రైతులు ఎరువులను కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో బుకింగ్ రద్దు అవుతుంది. ఎరువులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ రైతులు డీలర్లకు చూపించాలి. దీనికోసం ఎరువుల దుకాణాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం రైతులతో కలిసి మక్కపేటలో యాప్‌లో ఏ విధంగా బుక్ చేయాలి అవగాహన కల్పించారు. ఏడీఏలు శ్రీరాజన్, సి. భవాని, ఏవో జి. సత్యనారాయణ డీలర్లు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు(వత్సవాయి): పెనుగంచిప్రోలులో వేంచేసిన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో అమ్మవారి మాలధారణ జనవరి రెండో తేదీ నుంచి జరగనుంది. మాలధారణ షెడ్యూలును మంగళవారం ఆలయ ఈఓ నూతక్కి వెంకటసాంబశివరావు, చైర్మన్ చుంచు రమేష్‌బాబు విడుదల చేశారు. జనవరి రెండు నుంచి ఏడో తేదీ వరకు మండల దీక్షామాలాధారణ జరుగుతుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి ఏడో వరకు అర్ధమండల మాలధారణ ఉంటుందని ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.


