లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు ఉండే బోయ్స్ హాస్టల్‌ను ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు(ఫ్రెషర్స్), సీనియర్ విద్యార్థులతో కలిసి మాట్లాడారు. వసతి గృహంలో ర్యాగింగ్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రత్యేకంగా ఆరా తీశారు. ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. అనంతరం వసతి గృహంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, భోజన నాణ్యత, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, భద్రత తదితర అంశాలపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యత ఆహార సదుపాయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న సంబంధించి 73 గ్రామ పంచాయతీల్లో 856 వార్డులకు 1,001 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. విజయవాడ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి జి.కొండూరు మండలంలో 22 పంచాయతీల్లో 224 వార్డులు, ఇబ్రహీంపట్నం మండలంలో 10పంచాయతీల్లో 116 వార్డులు, మైలవరం మండలంలో 13 గ్రామ పంచాయతీల్లో 154 వార్డులు, విజయవాడ గ్రామీణ మండలంలో 16 పంచాయతీల్లో 226 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. అలాగే తిరువూరు రెవెన్యూ డివిజన్ రెడ్డిగూడెం మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో 136 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపు లు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్(ఏపీఎంఈయూ) ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల శాఖకు నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటుకూరి గిరిబాబు ఆదేశాల మేరకు వైద్య కళాశాల ప్రాంగణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా జి.పుణ్య కుమారి, ఉపాధ్యక్షుడిగా ప్రసాద్, కార్యదర్శిగా పి.సౌభాగ్యం, డెప్యూటీ సెక్రటరీగా మంచాల సురేష్‌కుమార్, జాయింట్ సెక్రటరీలుగా వి.లక్ష్మీప్రియ, పి.జ్యోతి మీనాక్షి, కోశాధికారిగా వేణుగోపాలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా జి.భాగ్యశ్రీ, డి.గీతను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన యూనియన్ రాష్ట్ర కోశాధికారి, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు ప్రమాణ స్వీకారం చేయించారు.
మచిలీపట్నంటౌన్: ఎల్ఐసీలో 1996 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ను అమలు చేయాలని ఐసీఈయూ నాయకులు ఆదివారం రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర శాఖ, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 2010 సంవత్సరానికి ముందు 1995 పెన్షన్ నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగి, 2010 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులకు పాత పెన్షన్ అమలు చేస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 158 జీవోను జారీ చేసిందన్నారు. ఎల్ఐిసీలో 1996 నోటిఫికేషన్ ద్వారా రిక్రూటయి 2010 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు పాత పెన్షన్ బదులు కొత్త పెన్షన్ అమలు చేస్తున్నారని, ఇది ఆ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు. దీన్ని సరిదిద్దేందుకు కూటమిలో కీలక భాగస్వామిగా ప్రముఖ పాత్ర పోషిస్తున్న సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఎల్ఐసీ కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ వేము కోటేశ్వరరావు, ఐసీఈయూ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.


