నందిగామ రూరల్: మహిళా క్రీడాకారుల్లో ఆత్మ విశ్వాసం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఇంటర్ యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీలు దోహద పడతాయని కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కోన రాంజీ పేర్కొన్నారు. పట్టణంలోని కేవీఆర్ కళాశాలలో డిసెంబర్‌లో నిర్వహిస్తున్న సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీల ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు అందించాల్సిన వసతి, తదితర సదుపాయాలపై స్థానిక కళాశాలల యాజమాన్యాలతో చర్చించారు. కార్యక్రమంలో కళాఽశాల ప్రెసిడెంట్ యర్రంరెడ్డి బాబురావు, ప్రిన్సిపాల్ రాజప్ప, కమిటీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్, పీడీ వాసిరెడ్డి నాగేశ్వరరావు, స్థానిక కళాశాలల యాజమానులు అమరనేని రమేష్‌బాబు, గడుపుడి శ్రీరామ్, కాసరగడ్డ కిరణ్, ఆళ్ల రాంబాబు, జీవీ ప్రసాదరావు, యూనివర్శిటీ స్పోర్ట్స్ సెక్రటరీ నల్లూరి శ్రీని వాసరావు పాల్గొన్నారు.
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో కార్తికమాసం సందర్భంగా మంగళవారం భక్తజన సందోహంతో పోటెత్తారు. ఉదయం క్యూలు భక్తులతో కళకళలాడాయి. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నాగమల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు మాట్లాడుతూ కార్తికమాసం తొలిరోజు మంగళవారం వివిధ సేవా టికెట్ల ద్వారా మొత్తం రూ. 9,53,735 ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): రేషన్ కార్డుదారులకు సరసమైన ధరలకే బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం విక్రయాలు జరుపుతున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి పి. శివరామప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మచిలీపట్నం, కంకిపాడు రైతుబజార్లలోని కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీపీటీ రకం బియ్యం కిలో రూ. 48, కేఎన్‌ఎం రకం కిలో రూ. 50కి విక్రయిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రత్యేక ప్యాకింగ్ ద్వారా 26 కిలోల వినియోగదారులకు అందిస్తారన్నారు. ఇప్పటి వరకు1959 మంది వినియోగదారులకు కేఎన్‌ఎం రకం బియ్యం 451.10 క్వింటాళ్లు, బీపీటీ రకం బియ్యం 68.90 క్వింటాళ్లు విక్రయిస్తారన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీ నుంచి డాక్టర్ బులుసు అపర్ణ సహస్రావధానం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య తెలిపారు. మంగళవారం ఆ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు మాట్లాడుతూ ఆ రోజు డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ సహస్రావధానాన్ని ప్రారంభిస్తారన్నారన్నారు. హిందూ హైస్కూల్స్ కమిటీ కోశాధికారి గోళ్ళ బాబా విజయ్ కుమార్, పీఎస్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి చిట్టా అమర్ సుధీర్, కోశాధికారి కాజ రాఘవయ్య మాట్లాడారు అవధాని బులుసు అపర్ణ మాట్లాడుతూ ఆశుపద్యాలు, ఘంటావధానంతో కలిపి మొత్తం 1000 పద్యాలు పూర్తవుతాయన్నారు. సమావేశంలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


