జి.కొండూరు: పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసేందుకు రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు డెప్యూటీ తహసీల్దార్ పెండెం విజయ్‌కుమార్ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టు బడ్డారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్రవంతిరాయ్ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన చిన్ని నజరేన్‌రావు ఇటీవల జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో 98 సెంట్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ తర్వాత పట్టాదారు పాసుపుస్తకం కోసం గత నెల 15న మీ–సేవ కేంద్రంలోలో దరఖాస్తు చేశారు. అనంతరం 24వ తేదీ జి.కొండూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తును డెప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు అందజేశారు. దీనిలో భాగంగా పాసుపుస్తకం జారీ చేసేందుకు డెప్యూటీ తహసీల్దార్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నజరేన్‌రావు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వల పన్నారు. జి.కొండూరు తహసీల్దార్ కార్యాలయంలో నజరేన్‌రావు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డెప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం 2.05 గంటల సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారులెవరైనా లంచం డిమాండ్ చేసినప్పుడు 1064కి ఫోన్ చేస్తే ఏసీబీ చర్యలు తీసుకుంటుందని అడిషనల్ ఎస్పీ స్రవంతిరాయ్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీలు బి.వెంకటసుబ్బారావు, జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.


