వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సమాజంలోని భావ కాలుష్యాన్ని రూపుమాపే గొప్ప సాధనం ఉత్తమ సాహిత్యమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘గీతాంజలి’ పుస్తకాన్ని రిటైర్డ్ ఏఐఎస్ అధికారి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య తెలుగులోకి అనువదించగా ఆ గ్రంథాన్ని ఎమ్మెస్కో బుక్ హౌస్ ప్రచురించింది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రాంగణంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్.వి.రమణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. భక్తి, ప్రేమ, ప్రకృతి సౌందర్యం, మానవత్వం, జీవిత విధానం, తత్వాల కలబోతే గీతాంజలి అని పేర్కొన్నారు. ఎమ్మెస్కో అధినేత విజయకుమార్‌ను అభినందించారు. రచయిత పి.కృష్ణయ్య మాట్లాడుతూ.. మాతృభాషపై అందరికీ మక్కువ ఉండాలన్నారు. ఆ మక్కువతోనే తాను పలు గ్రంథాలను తెలుగులోకి అనువదించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెస్కో సంస్థ అధినేత విజయకుమార్ నిర్వహించగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రసంగించారు.


