గంజాయి విక్రయ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయ ముఠా అరెస్ట్‌

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

మంగళగిరి రూరల్‌/నగరంపాలెం: పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి వ్యాపారంలోకి దిగి చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మంగళగిరి మండల పరిధిలోని కాజ గ్రామంలో జరిగింది. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ వకుల్‌ జిందాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన చదల నందమయ్య విజయవాడకు చెందిన వెనిగళ్ల పద్మ వద్ద నాలుగు కిలోల గంజాయిని రూ.68 వేలకు కొనుగోలు చేశాడు. మంగళగిరి, విజయవాడ, కాజ ప్రాంతాల్లోని యువకులను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన పప్పు ఉమానాగు, కావర్ల షణ్ముఖ్‌, కట్టా మహేష్‌, మొగిలిశెట్టి లక్ష్మణ్‌ కళ్యాణ్‌, వల్లెపు వెంకటేష్‌ అలియాస్‌ వెంకటేశ్వరరావు, కుప్పాల శ్రీనివాస్‌, కృష్ణాజిల్లా మంటాడకు చెందిన కోడెబోయిన రంజిత్‌, గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన తాడిబోయిన కోటేశ్వరరావుతో కలిసి ముఠాగా ఏర్పడి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి కాజ సమీపంలోని వెంకటరెడ్డిపాలెం జాతీయ రహదారి అండర్‌పాస్‌ వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారంతో మంగళగిరి రూరల్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3.1 కిలోల గంజాయి, కారు, తూకం వేసే కాటా మెషిన్‌, ప్యాకింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.62 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముఠాలో ఆరుగురికి గతంలో నేర చరిత్ర ఉండగా, ముగ్గురు రౌడీషీటర్లుగా ఉన్నట్లు వెల్లడించారు. గంజాయి సరఫరాకు సంబంధించి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడకు చెందిన వెనిగళ్ల పద్మ, పిడుగురాళ్లకు చెందిన ఆకాష్‌ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన నార్త్‌ డీఎస్పీ కె.వెంకటేశ్వర్లు, మంగళగిరి రూరల్‌ సీఐ చిరుమామిళ్ల వెంకట్‌, పోలీసు సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించారు.

3.1 కిలోల గంజాయి, కారు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement