గాంధీనగర్(విజయవాడసెంట్రల్):ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ లక్ష్మీశ, ఎన్నికల వ్యయ పరిశీలకుడు బి.విజయకుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలు, అభ్యర్థుల ఎన్నికల వ్యయ పర్యవేక్షణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
పోలింగ్ కేంద్రాల పరిధిలో నిబంధనలు పాటించాలి
పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి టెంట్లు ఏర్పాటు చేయరాదని, 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్లకు పంపిణీ చేసే ఓటరు స్లిప్పులపై ఎలాంటి గుర్తులు, పార్టీ చిహ్నాలు ఉండరాదని తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ బూత్‌లోకి వెళ్లే సమయంలో ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా ధరించాలని, పార్టీ కండువాలు ధరించి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లరాదని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోలింగ్ ఏజెంట్లపై ప్రిసైడింగ్ అధికారులు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటారని వివరించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఓటు హక్కును తప్పనిసరిగా
వినియోగించుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ


