లబ్బీపేట(విజయవాడతూర్పు): అర్నబ్ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కొండ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూచించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ విజయనగర్ కాలనీ కొండ ప్రాంతంలో బి.వెంకటేశ్వరరావు ఇంటి కింద మట్టి జారి ప్రమాదకరంగా మారుతుండటంతో ఆ ప్రాంతాన్ని బుధవారం దేవినేని అవినాష్ పరిశీలించారు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఇళ్లకు ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఇల్లు జారిపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించి, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని కోరారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్


