విజయవాడ అతలాకుతలం..
పునరావాస కేంద్రాల్లో 313 మంది
భీకర గాలులు, చిమ్మ చీకట్లతో జనాల అవస్థలు
స్తంభించిన ఎన్టీఆర్ జిల్లా
● కృష్ణా జిల్లా వ్యాప్తంగా
విస్తారంగా వర్షాలు
● నేలవాలిన వరిపైర్లు
● దెబ్బతిన్న ఉద్యాన పంటలు
● ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు
● విద్యుత్ సరఫరా
అంతరాయంతో ప్రజల అవస్థలు
విజయవాడలో అమ్మ కల్యాణమండపం, సున్నపుబట్టి సెంటర్, మొగల్రాజపురం, చిట్టినగర్‌తో పాటు ఇతర కొండ ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్న ప్రజలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. బుడమేరు కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్క మొక్కలను తొలగించే పనులు చేపట్టారు. బుధవారం ఉదయం రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్ వద్ద ప్రవహించే బుడమేరు కాలువలో క్షేత్రస్థాయిలో వ్యర్థాల తొలగింపు పనులను వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్నబ్ తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వర్షం బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా కురిసింది. జిల్లాలో 55.20 మిల్లీ మీటర్ల సగటు వర్ష పాతం నమోదైంది. జిల్లాలో విజయవాడ రూరల్, నార్త్, సెంట్రల్, వెస్ట్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. విజయవాడ సెంట్రల్, వెస్ట్‌లో 117.4 మిల్లీమీటర్ల చొప్పున, విజయవాడ రూరల్, నార్త్ మండలాల్లో 101.8 మిల్లీమీటర్లు, విజయవాడ ఈస్ట్‌లో 97.4, మైలవరంలో 64.6, ఇబ్రహీంపట్నంలో 79.6, జి. కొండూరులో 68.4, వీరులపాడులో 58,4, కంచికచర్లలో 41.6, జగ్గయ్యపేటలో 19.4, చందర్లపాడులో 26.8, వత్సవాయిలో 13.0, పెనుగంచిప్రోలులో 14.2, నందిగామలో 28.4, రెడ్డిగూడెంలో 35.0, తిరువూరులో 22.4, విస్సన్నపేటలో 26.8, ఏ కొండూరులో 42.2, గంపలగూడెంలో 28.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 313 మంది ఆశ్రయం పొందినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 605 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 313 మంది పునరావాసం పొందారన్నారు. వీరికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆయా కేంద్రాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారం, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం సక్రమంగా అందిస్తున్నారా లేదా అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంకా పంటనష్టం అంచనాలు రాలేదు.


