పట్టణ ప్రజలకు ఉచిత వైద్యం దూరం యూపీహెచ్‌సీలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో దిగజారిన వైద్య సేవలు వైద్యం అందక పేదలకు ఇబ్బందులు
గతంలో 63 పరీక్షలు, 182 రకాల మందులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పట్టణ ప్రజలకు ఉచిత, ఆధునిక వైద్యం దూరమవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో యూపీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెండున్నరేళ్లలో మూలనపడ్డాయి. రోగులకు మందులు కూడా సరిగా అందడం లేదు. దీంతో నగర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యంచేయడమే లక్ష్యంగా కూటమి పెట్టుకుంది. అందులో భాగం పట్టణ ప్రజలకు సత్వరమే వైద్యం అందించే యూపీహెచ్‌సీలు నిర్వీర్యం అయ్యాయి. కనీసం బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్ మాత్రలు కూడా ఉండని దయనీయ పరిస్థితి నెలకొంది.
పరికరాలు నిర్వీర్యం
యూపీహెచ్‌ల్లో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన లెబోరేటరీ పరికరాలు నిర్వీర్యంగా మారాయి. ఇప్పుడు అక్కడ కేవలం బ్లడ్ శాంపిల్స్‌ను మాత్రమే సేకరించి సెంట్రల్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. దీంతో పరికరాలన్నీ మూలన పడ్డాయి. అంతేకాదు నగరంలోని పలు సెంటర్లలో గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసేందుకు స్కానింగ్ యంత్రాలను సమకూర్చి గైనకాలజిస్టును నియమించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గైనకాలజిస్టును తొలగించి, స్కానింగ్ పరికరాలను ఇతర జిల్లాల ఆస్పత్రులకు తరలించేశారు.
అరకొర సిబ్బంది, మందులు కొరత
ప్రస్తుతం విజయవాడ నగరంలోని 15 యూపీహెచ్‌సీల్లో వైద్యులు లేని పరిస్థితి నెలకొంది. ఒక్కో వైద్యుడు రెండు యూపీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ల్యాబ్ టెక్నీషియన్‌లు, స్టాఫ్‌నర్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో యూపీహెచ్‌సీల్లో సేవలు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. మరో వైపు బీపీ, గ్యాస్ ట్రబుల్ మాత్రలు కూడా యూపీహెచ్‌సీల్లో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జిల్లాలో 48 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వాటిలో విజయవాడ నగరంలోనే 41 ఉన్నాయి. కొండపల్లి, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరుల్లో మరో ఏడు యూపీహెచ్‌సీలు ఉన్నాయి. వాటి కోసం 15 వరకూ అత్యాధునిక భవనాలు నిర్మించారు. అంతేకాదు ప్రతి యూపీహెచ్‌సీలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి రూ.50 లక్షలు వెచ్చించి అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశారు. ప్రతి యూపీహెచ్‌సీలో 63 రకాల పరీక్షలు చేసి, రోగులకు అవసరమైన 182 రకాల మందులను ఉచితంగా అందజేసే వారు. దీంతో గత ప్రభుత్వంలో యూపీహెచ్‌సీలకు రోగులు సైతం పెద్ద సంఖ్యలో వచ్చేవారు.


