పారదర్శక పాలన అందిస్తాం తాగునీరు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఎర్రకాలువ, వేపలవాగు ప్రక్షాళనపై దృష్టి
జగనన్న కాలనీలను అభివృద్ధి చేస్తాం
అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం
జగ్గయ్యపేట మునిసిపల్ వైఎస్సార్ సీపీ చైర్పర్సన్ అభ్యర్థి హఫీజున్నీసా
జగ్గయ్యపేట అర్బన్: ‘పట్టణంలోని అన్ని వార్డుల్లో వివక్షకు తావులేకుండా అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేస్తాం. అవినీతి లేని పాలన అందిస్తాం. పాలకవర్గంపై విశ్వసనీయత కల్పించేలా కృషి చేస్తాం’ అని జగ్గయ్యపేట మునిసిపల్ వైఎస్సార్ సీపీ చైర్ పర్సన్ అభ్యర్థి షేక్ హఫీజున్నీసా అన్నారు. 17వ వార్డు కౌన్సిలర్‌గా, మునిసిపల్ వైస్ చైర్మన్‌గా గత పాలకవర్గంలో ప్రజాసేవ చేసిన తనకు పట్టణ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తామని అన్నారు. ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
తాగునీటికి కొత్త పైపు లైన్
మునిసిపల్ ఎన్నికల్లో గెలిచి పాలన చేపట్టిన వెంటనే పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తా. 70 ఏళ్ల క్రితం పంచాయతీగా ఉన్న జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన పైపులైన్లు తుప్పు పట్టిపోయాయి. పలు ప్రాంతాల్లో పైపులైన్లు నిత్యం లీకవుతూ తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పూర్తిస్థాయిలో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేసి దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు చెక్ పెడతా. పారిశుద్ధ్య విభాగంలో అవినీతి, నిర్లక్ష్య ధోరణిని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. జగ్గయ్యపేటను స్వచ్ఛ పట్టణంగా మారుస్తాం.
పన్నుల భారం లేకుండా..
ప్రజలపై పన్నుల భారం పడకుండా మునిసిపల్ ఆదాయాన్ని పెంచి పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాం. మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆధునికీకరణ చేసి మరింత ఆదాయం వచ్చేలా చూస్తాం. కబ్జాలకు గురవుతున్న మునిసిపల్ ఆస్తులు, స్థలాలను కాపాడటం ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తాం. పట్టణంలో ఖాళీ స్థలాలు, డివైడర్లపై గ్రీనరీ పెంచుతాం. కోదాడ రోడ్డు, చిల్లకల్లు రోడ్డులో సెంట్రల్ లైటింగ్‌ను ఆధునికీకరణ చేస్తాం.
వైఎస్సార్ సీపీ గత ఐదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడాలేని విధంగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒకేసారి 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. పేదల సొంతింటి కల నిజం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీ ఎల్పీ–1, ఎల్పీ–2 నిరాదరణకు గురయ్యాయి. ఎల్పీ–1లో 140 మందికి స్థలాలు ఇవ్వగా 30 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఎల్పీ–2లో 540 మందికి స్థలాలు మంజూరవగా 300 మంది నివసిస్తున్నారు. జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సౌక ర్యాలు కల్పించి, లబ్ధిదారులు పూర్తిస్థాయిలో నివసించేలా చర్యలు తీసుకుంటాం.
గత వైఎస్సార్ సీపీ పాలనలో జాతీయ రహదారిపై రూ.1.30 కోట్లతో హైవే బస్టాండ్ ఏర్పాటు చేసినప్పటికీ కూటమి పాలకుల నిర్లక్ష్యంతో నేటికీ వాడుకలోకి రాలేదు. ఈ బస్టాండ్ వినియోగంలోకి వచ్చేలా కృషిచేస్తాం. ఎర్రకాలువ, వేపలవాగు ప్రక్షాళనకు అధిక ప్రాధాన్యమిస్తాం. రూ.3.50 కోట్లతో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న చెరువు అభివృద్ధి ప్రాజెక్టును తిరిగి చేపట్టి పూర్తిచేస్తాం. టీటీడీ కల్యాణ మండపాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం.


