గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. తమను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్, కొండపల్లి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు మునిసిపాలిటీల్లో సోమవారం అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు సైతం ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
విజయవాడలో...
నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సూర్యారావుపేట, గంటా వారి వీధి, నక్కల రోడ్డు ప్రాంతాల్లో కార్పొరేటర్ అభ్యర్థి యర్రంశెట్టి అంజిబాబుతో కలిసి ప్రచారం నిర్వహించారు. మల్లాది విష్ణు, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
జగ్గయ్యపేటలో..
పట్టణంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం ఊపందు కుంది. మూడో వార్డులో పార్టీ నాయకులు, కార్యక ర్తలతో కలిసి చైర్మన్ అభ్యర్థి హఫీజున్నీసా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో మమేకమై, వైఎస్సార్ సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. తన్నీరు సుధారాణి ప్రచారంలో పాల్గొన్నారు.
తిరువూరులో...
పట్టణంలోని 25వ వార్డులో మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు కౌన్సిలర్ అభ్యర్థి ధర్మవరపు తిరుపతమ్మతో కలిసి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి నలగట్ల స్వామిదాసు ప్రచారంలో పాల్గొని వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని చూసి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయాలని కోరారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
కొండపల్లిలో...
కొండపల్లి మునిసిపాలిటీలోని 23, 15వ వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులు ఆరేపల్లి రాము, గెత్తం నవీన్ కుమార్‌తో కలిసి చైర్మన్ అభ్యర్థి నల్లమోతు తేజస్వి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో పలు సామాజిక వర్గాల పెద్దలను కలిసి మద్దతు కోరారు. మున్సిపాలిటీలో తాము చేపట్టబోయే పనులను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు పోరంకి శ్రీనివాసరాజు, లంకే అంకమోహనరావు, నల్లమోతు ప్రకాష్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిగామలో...
పట్టణంలో చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వంలో నందిగామ పట్టణంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో సంక్షేమ పథకాలు అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.


